అగర్‌బత్తీలు, స్కూల్‌ బ్యాగ్‌లపై జీఎస్టీ కనికరం | Sakshi
Sakshi News home page

అగర్‌బత్తీలు, స్కూల్‌ బ్యాగ్‌లపై జీఎస్టీ కనికరం

Published Mon, Jun 12 2017 1:54 AM

అగర్‌బత్తీలు, స్కూల్‌ బ్యాగ్‌లపై జీఎస్టీ కనికరం - Sakshi

66 వస్తువులపై పన్నుకోత
► ప్యాకేజ్డ్‌ ఆహారం, పచ్చళ్లు, ఆవాలు, జీడిపప్పు చౌక
► రూ. వందలోపు సినిమా టికెట్లపై 18 శాతం
► జీఎస్టీ మండలి కీలక నిర్ణయం
► దాదాపు ఇవే చివరి మార్పులన్న జైట్లీ
►  జూన్‌ 18న మరోసారి కౌన్సిల్‌ భేటీ


తగ్గిన పన్నురేట్లు
12 నుంచి 5 శాతానికి తగ్గినవి - జీడిపప్పు, అగర్‌బత్తీలు, ఇన్సులిన్‌
18 నుంచి 5 శాతానికి తగ్గినవి - వజ్రాలు, తోలు, వస్త్ర పరిశ్రమ ఆభరణాలు, ప్రింటింగ్‌ పరిశ్రమ
18 నుంచి 12 శాతానికి తగ్గినవి -  ప్యాకేజ్డ్‌ ఆహారం, పచ్చళ్లు, సాస్‌లు, ఆవాలు, మురబ్బా, పిల్లల వర్క్‌బుక్స్, స్పూన్లు, ఫోర్క్‌లు
28 నుంచి 18 శాతానికి తగ్గినవి -  స్కూలు బ్యాగులు, కాటుక, ట్రాక్టర్‌ విడిభాగాలు, ప్లాస్టిక్‌ పూసలు, కంప్యూటర్‌ ప్రింటర్లు

న్యూఢిల్లీ: సామాన్యులపై వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ప్రభావం పడకుండా 66 వస్తువులపై జీఎస్టీ మండలి పన్నుకోత విధించింది. జీఎస్టీ శ్లాబుల వర్గీకరణపై పరిశ్రమతోపాటు సమాజంలోని వివిధ వర్గాలనుంచి వచ్చిన డిమాండ్లు, వినతులకు అనుగుణంగా రేట్ల విధానంలో మార్పు చేసింది. పన్ను రేట్లను 133 పరిశ్రమలనుంచి వచ్చిన డిమాండ్లను సమీక్షించి.. 66 వస్తువులపై పన్నురేట్లు తగ్గించాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ నేతృత్వంలో ఆదివారం సమావేశమైన జీఎస్టీ మండలి చిరువ్యాపారులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంది.

ప్యాకేజ్డ్‌ ఆహా రం, స్కూలు బ్యాగులతోపాటు రోజువారీ వినియోగంలో వచ్చే వస్తువులపై పన్నును తగ్గిం చినట్లు జైట్లీ వెల్లడించారు. దాదాపుగా ఇదే చివరి పన్నురేట్ల మార్పు అని.. ఇకపై మార్పులు, చేర్పులేమీ ఉండవని ఆయన స్పష్టం చేశారు. జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో బ్యాంకింగ్, బీమా, వస్త్ర, ఎగుమతులు, సమాచార సాంకేతికత, రవాణా, చమురు, గ్యాస్‌ వంటి రంగా ల్లో సమస్యలను పరిష్కరించేందుకు 18 రంగాల గ్రూపులను కేంద్రం ఏర్పాటుచేసింది. వం టింటి పదార్థాలైన పచ్చళ్లు, ఆవాలతోపాటుగా 66 వస్తువులపై జీఎస్టీ మండలి పన్నురేట్లు తగ్గించింది.

చిన్న, మధ్య తరహా వ్యాపారులకు మేలు
రూ.100 రూగపాయల్లోపల సినిమా టికెట్ల ధరలను గతంలో ఉన్న 28 శాతం నుంచి తొలగించి 18 శాతం శ్లాబులోకి చేర్చారు. రూ.100 పైనున్న టికెట్లపై ధరలు ఇటీవల నిర్ణయించిన రేటు (28 శాతం)తోనే కొనసాగనున్నాయి. పచ్చళ్లు, ఆవాలు, మురబ్బా వంటి వాటిని 12 శాతం (గతంలో 18శాతంలో ఉండేవి)లోకి చేర్చగా.. జీడిపప్పును 12 నుంచి 5 శాతం పరిధిలోకి తీసుకొచ్చారు.

ఏడాదికి 75 లక్షల టర్నోవర్‌ ఉన్న వ్యాపారులు, తయారీదారులు, రెస్టారెంట్‌ యజమానులు (గత పరిమితి రూ.50 లక్షల టర్నోవర్‌) కాంపోజిషన్‌ పథకాన్ని ఎంచుకుని వరుసగా 1, 2, 5 శాతం రేట్లతో పన్ను చెల్లించాలని నిర్ణయించింది. ‘ఆదాయ స్థిరత్వంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. దీనివల్ల కాస్త నష్టం కనబడుతున్నా చిన్న, మధ్యతరహా వ్యాపారులు, రెస్టారెంట్లను ఆదుకోవాలని నిర్ణయించాం. ఎందుకంటే ఈ రంగాల్లోనే ఎక్కువ ఉపాధికల్పన జరుగుతోంది’ అని జైట్లీ వెల్లడించారు.

డిజిటల్‌ చెల్లింపుల హెల్ప్‌లైన్‌ 14442
డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈ దిశగా తలెత్తే సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త టోల్‌ ఫ్రీ నెంబరును ఏర్పాటుచేయనుంది. వినియోగదారుల డిజిటల్‌ సమస్యల కోసం 14442 నెంబరును అమల్లోకి తీసుకురానుంది. ఇందుకు టెలికాం శాఖ పచ్చజెండా ఊపింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా ఈ టోల్‌ ఫ్రీ నెంబరు కోసం వ్యవస్థను నిర్మించే పనిలో ఉన్నాయి.

తగ్గనున్న ఇన్సులిన్, స్కూలు బ్యాగులు
చిన్న పిల్లల డ్రాయింగ్‌ పుస్తకాలను 12 శాతం నుంచి పన్నురహిత వస్తువుల్లోకి చేర్చగా.. స్కూలు బ్యాగులు 18 శాతంలోకి వచ్చాయి. కంప్యూటర్‌ ప్రింటర్లు గతంలో ఉన్న 28 శాతం నుంచి 18 శాతంలోకి వచ్చాయి. ఇన్సులిన్, అగర్‌బత్తీలు ఐదుశాతంలోకి.. కాటుక 28 నుంచి 18 శాతంలోకి వచ్చాయి. మొత్తం 133 వస్తువులకు సంబంధించి ప్రతిపాదనలు రాగా.. 66 వస్తువుల పన్నురేట్లను తగ్గించాం’ అని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ వెల్లడించారు. జూన్‌18న జరిగే తదుపరి జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశంలో లాటరీ పన్నులు, ఈ–వే బిల్లులపై నిర్ణయం తీసుకోనున్నారు.

హైబ్రిడ్‌ కార్లపై జీఎస్టీ సమీక్ష విషయంలో రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాక స్పందించాలని మండలి నిర్ణయించింది. వజ్రాలు, తోలు, వస్త్ర, ఆభరణ, ప్రింటింగ్‌ పరిశ్రమలపై పన్నురేటును 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించింది. ‘అంతకుముందు ఈ సేవలను 18 శాతం పన్ను పరిధిలో ఉండేవి. ఈ రంగాల్లో ఎక్కువమంది ఇంటినుంచే పనిచేస్తుంటారు. అందుకే వారి అవకాశాలను దెబ్బ తీయకుండా వీటిని ఐదుశాతం పరిధిలోకి తీసుకొచ్చామ’ని జైట్లీ వెల్లడించారు. ట్రాక్టర్‌ విడిభాగాలు, ప్లాస్టిక్‌ టార్పలిన్‌లపై పన్నును  18 శాతానికి తగ్గించారు.  ధరలు తగ్గించని వస్తువుల విషయంలో.. సూచించిన  మార్పులకు  అధికా రుల అధ్యయనంతో సంబంధం లేకపోవడంతో సమీక్షించలేదన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement