సాఫ్ట్‌వేర్.. సమస్యలతో బేజార్

1 Aug, 2016 01:01 IST|Sakshi
సాఫ్ట్‌వేర్.. సమస్యలతో బేజార్

సాంకేతిక లోపాలతో సతమతమవుతున్న రెవెన్యూ శాఖ
* పరిష్కారం కనుగొనని ఉన్నతాధికారులు
* ఇలాగైతే కష్టమంటున్న తహసీల్దార్లు
* ‘క్రమబద్ధీకరణ’ అమలులో వైఫల్యం

సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో వివిధ పథకాల అమలు నిమిత్తం భూపరిపాలన కార్యాలయం ప్రవేశపెట్టిన సాఫ్ట్‌వేర్ ఎందుకూ కొరగాకుండా పోతోంది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి ఉన్నతాధికారులు సమకూర్చిన ఆన్‌లైన్ విధానాలతో పారదర్శకత సంగతేమో గానీ, గత రెండేళ్లుగా ఏ పథకం కూడా సంపూర్ణంగా అమలుకు నోచుకోలేదు.

2014 డిసెంబర్‌లో ప్రభుత్వం ప్రారంభించిన భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ నుంచి నిన్నమొన్నటి సాదా బైనామాల క్రమబద్ధీకరణ వరకు సాంకేతిక సమస్యలతో రెవెన్యూ యంత్రాంగమంతా సతమతమవుతోంది. సమస్యలు పరిష్కరించకపోగా పథకాల అమలు విషయంలో వైఫల్యాలకు తహసీల్దార్లనే బాధ్యులను చేస్తూ చార్జిమెమోలు, ఇంక్రిమెంట్లలో కోతలు విధిస్తామంటున్నారు. ఇది ఎంతవరకు సబబని తెలంగాణ తహ సీల్దార్ల సంఘం ప్రశ్నిస్తోంది. టీజీటీఏ ఆధ్వర్యంలో తహసీల్దార్లంతా మూకుమ్మడిగా ఆందోళనకు దిగడంతో మేల్కొన్న సర్కారు త్వరలోనే ఇబ్బందులను తొలగిస్తామని హామీ ఇచ్చింది.
 
కొలిక్కిరాని క్రమబద్ధీకరణ ప్రక్రియ
రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ మొదలై రెండేళ్లు కావస్తున్నా, ఇంతవరకు ఓ కొలిక్కి రాలేదు. సాంకేతిక సమస్యల కార ణంగా పక్కన బెట్టిన దరఖాస్తులను అధికారులు ఇంతవరకు పరిష్కరించలేదు. జీవో 58 ప్రకారం పేదలు నివాసముంటున్న స్థలాలను ఉచితంగా వారికి క్రమబద్ధీకరించాలి. ఈ విషయంలో ఎంతోమందికి ఆధార్ కార్డు లేదని, కార్డు ఉన్నా ఇన్‌వాలిడ్ అని రావడంతో నేటి వరకు ఆ దరఖాస్తులను ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. అలాగే జీవో 59 కింద చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణ నిమిత్తం ఏడాది క్రితమే సొమ్ము చెల్లించినా ఆ భూములనూ అధికారులు రిజిస్ట్రేషన్ చేయడం లేదు.

మొత్తం 49,211 దరఖాస్తులు ప్రభుత్వం వద్ద ఉంటే.. ఇప్పటివరకు ఆయా దరఖాస్తుల్లో అధికారులు క్లియర్ చేసింది 7,451 దరఖాస్తులే (15శాతం) కావడం గమనార్హం. ఈ ప్రక్రియ నిమిత్తం భూపరిపాలన  అధికారులు రూ.లక్షలు వెచ్చించి కొనుగోలు  చేసిన సాఫ్ట్‌వేర్‌లో రోజుకో రకమైన సమస్యలు తలెత్తుతుండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఇతర పథకాల అమలు తీరూ ఇందుకు భిన్నంగా ఏమీ లేదని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు