పదన పదనగా పారిన పసీనా... | Sakshi
Sakshi News home page

పదన పదనగా పారిన పసీనా...

Published Mon, Aug 1 2016 12:58 AM

పదన పదనగా  పారిన పసీనా... - Sakshi

 నేపథ్యం

ఎగిలివారంగతో సాహితీ లోకంలోకి అడుగు పెట్టి, దందెడతో సాహితి అభిమానులందరి హృదయాలకు దగ్గరై, అక్షర మొగ్గలుగా విచ్చుకొని బతుకు పరిమళాలు వెదజల్లుతూ ‘మిగ్గు’తో వినయంగా మీ ముందు తీరొక్కరంగుల పటమేస్తున్న.

ప్రకృతి కోసం, పరుల కోసం, పంటల కోసం, పని కోసం, ఉత్పత్తి కోసం, ప్రగతి కోసం, పనికిరాని పశువుల కళేబరాలను అక్కరకొచ్చె అరొక్క పనిముట్లుగా మల్చి, తరతరాలుగా వంచనకు గురవుతూ, ఎద్దడుగు జాగ, ఎండి, బంగారం, పైస, ఫలం లేని ఎడ్డి గుడ్డి ఎట్టి బతుకులు నాకిచ్చిన ఆస్తి కులం, బలగం, తోలుతిత్తి, బిత్తి, లంద, దందెడ, తాడు, తల్గు, వార్నె, మంచం, తొట్టె, బుట్ట, చెత్త, చెదారం, జోడు, కాడు, వారు, సంచి, గూటం, కత్తి, ఆరె, డప్పు.

చెప్పు కుట్టుతాంటె మా అయ్య ఎద్దు కొమ్మునుంచి ఎండిన పశువు కొవ్వు(మిగ్గు)ను తీసి, ఆరెను సానబెట్టి, అచ్చం శాస్త్రవేత్త లెక్కనె పదనపదనగా పారిన పసీననంతా పదునెక్కిన అతారెలు చేసేది. ఏది మాకు గాదు, పొద్దు గూకితె బుక్కెడు బువ్వ లేదు. జాతికి ఇంతజేసిన నా అయ్య ‘జాతిపిత’ కాలేదు. ఆకలితో, అనారోగ్యంతో నవిసిపోస్కొని నడుమంతరాన్నె నా అయ్య, అవ్వ చచ్చిండ్రు. నన్ను ఆగం జేసి, అనాథను జేసిండ్రు. ఆ ఆలాపనల నుంచి అక్షరబద్ధమైనదే ఈ మిగ్గు.

స్వాతంత్య్రం వచ్చి స్వరాజ్యం ఏర్పడి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, అందమైన నినాదాలుగా మారి ఆచరణలో ఆమెడ దూరంలోనె. ఇంకా కులం కంపు కొడుతూనె ఉంది. అంటరాని జీవితాలు అంధకారంలోనె. ఆకలితో, ఆత్మన్యూనతతో, అవమానాలతో, అసమానతలతోనె! అత్యాచారాలకు అణిచివేతలకు గురవుతూనె వున్న ఆ ఆదిమానవుల, కష్టజీవుల పరోపకారం తప్ప పగలు, ప్రతీకారాలు తెలువని అణగారిన ప్రజల ఆర్తనాదాల నుంచి ఈ మిగ్గు ముగ్గుబోసుకున్నది.

 (పొన్నాల బాలయ్య కవితా సంకలనం ‘మిగ్గు’ ప్రచురణ: తెలంగాణ రచయితల సంఘం.  పేజీలు: 126; వెల: 100; కవి ఫోన్: 9908906248)

Advertisement

తప్పక చదవండి

Advertisement