అంధులు ఓటేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్

1 Feb, 2016 02:40 IST|Sakshi
అంధులు ఓటేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్

♦ బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్ రూపకల్పన
♦ వెల్లడించిన కమిషనర్ జనార్దన్‌రెడ్డి
 
 బంజారాహిల్స్: అంధులు ఓటేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్ రూపొందించామని జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి, కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఈ బ్యాలెట్ పేపర్‌ను ఈవీఎంపై ఉంచి ఎవరి సహాయం లేకుండా అంధులు సొంతంగా ఓటు వేయొచ్చన్నారు. మొట్టమొదటిసారిగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనే దీనిని ప్రవేశపెట్టనున్నట్లు చెప్పారు. బంజారాహిల్స్‌లోని ముఫకంజ ఇంజినీరింగ్ కళాశాల కౌంటింగ్ కేంద్రాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు.

అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ప్రచారం ప్రశాంతంగా ముగిసిందన్నారు. ప్రతి వార్డు కార్యాలయం, పోలింగ్ స్టేషన్లలో ఓటర్ సౌలభ్య కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. మొత్తం 9,352 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామని, 1500 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించామని తెలిపారు. మూడు వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు వెబ్‌కాస్టింగ్‌లో శిక్షణనిచ్చామని చెప్పారు. సమస్యాత్మకంగా గుర్తించిన మూడు వేల పోలింగ్ స్టేషన్లను వెబ్‌కాస్టింగ్ ద్వారా పరిశీలిస్తామన్నారు. ఎన్నికల రోజున సినిమా థియేటర్లు, హోటళ్లు, మాల్స్ దుకాణాలకు సెలవు ప్రకటించాలని కార్మికశాఖకు లేఖ రాస్తామన్నారు.

మరిన్ని వార్తలు