ఎస్సీ ఎస్టీ నిధికి ప్రత్యేక కసరత్తు

6 Apr, 2017 02:46 IST|Sakshi
ఎస్సీ ఎస్టీ నిధికి ప్రత్యేక కసరత్తు

- మహిళా శిశు సంక్షేమ శాఖతో ప్రారంభం
- 30 లక్షల మందిలో ఎస్సీ, ఎస్టీల వడపోత
- శాఖలవారీగా అన్ని పథకాలకూ ఇదే నమూనా
- వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్న ఆర్థిక శాఖ  


సాక్షి, హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధి అమలుకు రాష్ట్ర ప్రభుత్వం భారీగా కసరత్తు చేస్తోంది. ప్రతి శాఖలో పథకాలను కొత్త చట్టానికి అనుగుణంగా విశ్లేషించే ప్రక్రియను ప్రారంభించింది. కొత్త చట్టం ప్రకారం ఈ నిధికి సంబంధించిన ఖర్చులను శాసనసభకు లెక్క చెప్పాల్సి ఉంది. అందుకే నిధుల వినియోగానికి సంబంధించి ప్రత్యేక కార్యాచరణను ప్రభుత్వం అనుసరిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసే ప్రతి పద్దులోనూ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు వెచ్చించే ప్రతి పైసానూ విడిగా లెక్కగట్టే విధానం అవలంబిస్తోంది. ఇందులో భాగంగా ఆర్థిక శాఖ ఆద్వర్యంలో అన్ని శాఖలతో సమీక్షలు మొదలయ్యాయి.

తొలుత మహిళా శిశుసంక్షేమ శాఖ పరిధిలో కీలకమైన ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు, అంగన్‌వాడీలు, వీటి పరిధిలో అమలవుతున్న పథకాలను సమీక్షించారు. బాలింతలు, ఆరేళ్లలోపు చిన్నారులకు పౌష్టికాహారంతోపాటు ఆరోగ్యలక్ష్మి పథకాలు అమల్లో ఉన్నాయి. వీటికి సంబంధించిన డేటా ఈ విభాగంలో సిద్ధంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ శాఖలో మొత్తం 30 లక్షల మంది లబ్ధిదారులున్నారు. వారిలో ఎస్సీ ఎస్టీలెందరు అనేది కేటగిరీలవారీగా వడపోసిన వివరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ వివరాలను సంబంధితశాఖ అధికారులు ఆర్థిక శాఖకు సమర్పించారు. వాటి ఆధారంగా మహిళా శిశుసంక్షేమ శాఖకు ప్రభుత్వం ఈ ఏడాది కేటా యించిన బడ్జెట్‌... అందులో ఎస్సీ, ఎస్టీల వాటా ఎంత... అనేది లెక్కతీస్తారు. ఈ ఏడాదిలో అయ్యే ఖర్చును సైతం అదే దామాషా ప్రకా రం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధిలో ఖర్చు చేసినట్లు పరిగణిస్తారు.

అన్ని శాఖల వివరాలు కోరిన సర్కారు...
ఉచిత విద్యుత్, ఆసరా పింఛన్లు, రైతు రుణమాఫీ, కల్యాణలక్ష్మి, ఫీజు రీయింబర్స్‌మెంట్, బియ్యం పంపిణీలోనూ ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల వాటాను విడివిడిగా అంచనా వేస్తున్నారు. అన్ని శాఖలు సైతం ఇదే తీరుగా సమాచారాన్ని సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖ అధ్వర్యంలో శాఖలవారీగా సమీక్షలు జరిపే బాధ్యతలను ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మకు అప్పగించింది. ముందస్తు కసరత్తులో భాగంగానే ప్రత్యేక నిధికి సంబంధించిన వ్యయాన్ని ఆర్థిక శాఖ నాలుగు రకాలుగా వర్గీకరించింది. కొన్ని పథకాలను లబ్ధిదారులవారీగా, కుటుంబాలవారీగా, సంఘాలవారీగా, ఆవాసాలవారీగా వ్యయాన్ని అంచనా వేయాలని నిర్ణయించింది.  

ఎస్సీ, ఎస్టీ ఆవాసాల్లో మొత్తం ఖర్చు...
చట్ట ప్రకారం ఎస్సీ లేదా ఎస్టీ జనాభా 40 శాతమున్న ఆవాసాలు, గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి పనులు, కార్యక్రమాలన్నీ ఈ నిధిలో ఖర్చు చేసినట్లుగా పరిగణిస్తారు. గతంలో అమలు చేసిన ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించటమే తప్ప ఖర్చు కావటం లేదని, ఇతర పథకాలకు మళ్లిస్తున్నారనే ఆరోపణలున్నాయి.

అందుకే కొత్త చట్టంలో ప్రభుత్వం నిధుల క్యారీ ఫార్వర్డ్‌ పద్ధతిని పొందుపరిచింది. దీని ప్రకారం రాష్ట్ర బడ్జెట్‌లో ఖర్చు చేసిన నిధుల దామాషా ప్రకారం.. బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధికి కేటాయించిన నిధులను ఖర్చు చేయాలి. లేనిపక్షంలో ఖర్చు కాని మేరకు నిధులను తదుపరి ఏడాది బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక నిధికి అదనంగా చేర్చాల్సి ఉంటుంది. ఈసారి బడ్జెట్‌లో ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధికి రూ.14,375 కోట్లు, ఎస్టీ నిధికి రూ.8,165 కోట్లు కేటాయించారు. వాటిని పక్కాగా ఖర్చు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. ఆ రెండు వర్గాలకు ఖర్చు చేసే కోటాను అన్ని శాఖల్లోనూ విడిగా లెక్కిస్తే ప్రత్యేక నిధి ఖర్చును పారదర్శకంగా వెల్లడించే వెసులుబాటు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు