ఔటర్‌పై స్పీడుకు బ్రేక్‌!

12 Feb, 2017 05:05 IST|Sakshi
ఔటర్‌పై స్పీడుకు బ్రేక్‌!
  • వేగాన్ని 100 కిలోమీటర్లకు తగ్గిస్తూ నిర్ణయం
  • రోడ్డు ప్రమాదాల నివారణపై దృష్టి.. గీత దాటితే జరిమానా
  • ఉమ్టా సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
  • సాక్షి, హైదరాబాద్‌: పరిధులు దాటి దూసుకుపోతున్న వాహనాలు... నిత్యం ప్రమాద ఘంటికలు మోగిస్తున్న ఔటర్‌ రింగ్‌రోడ్డుపై వేగానికి కళ్లెం పడింది. ప్రస్తుతమున్న 120 కిలోమీటర్ల అత్యధిక వేగాన్ని 100 కిలోమీటర్లకు తగ్గిస్తూ హైదరాబాద్‌ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నిర్ణయం తీసుకుంది. దీన్ని ఉల్లంఘించిన వాహనాలకు చలాన్లు జారీ చేయాలని నిర్ణయించారు. ఔటర్‌పై 208 కి.మీ. వేగంతో వాహనాలు వెళుతున్నాయన్న విస్మయకర వాస్తవాన్ని ఢిల్లీకి చెందిన సెంట్రల్‌ రోడ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ గుర్తించిన నేపథ్యంలో హెచ్‌ఎండీఏ ఈ మేరకు బ్రేకులు వేసింది.

    దీంతో పాటు నగరంలో ట్రాఫిక్‌ నియంత్రణకు తీసుకోవల్సిన చర్యలపై సీఎస్‌ ఎస్పీ సింగ్‌ అధ్యక్షతన హెచ్‌ఎండీఏ, రాచకొండ, సైబరాబాద్, నగర పోలీసు కమిషనరేట్లు, ఎండీహెచ్‌ఎంఆర్‌ఎల్, రవాణా, ఆర్‌ అండ్‌ బీ అధికారులతో సచివాలయంలో యూనిఫైడ్‌ మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్టు అథారిటీ (ఉమ్టా) సమావేశం జరిగింది. 2041 నాటికి ఇంటెలిజెంట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (సీటీఎస్‌)లో భాగంగా నగరంలో ఎన్ని కిలో మీటర్లలో రోడ్లు అభివృద్ధి చేయాలి, ఎంఎంటీఎస్, మెట్రో రైలును ఎలా అనుసంధానించాలి తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. ఈ సదుపాయాల కల్పనకు దాదాపు రూ.1.53 కోట్లు అవసరమవుతాయని అంచనా వేశారు.

    అలాగే ఓఆర్‌ఆర్‌ ఇంటెలిజెంట్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సిస్టమ్‌ (ఐటీసీ)లో భాగంగా అమలుచేయనున్న హైవే మేనేజ్‌మెంట్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌లో రహదారి పొడవునా సీసీ కెమెరాలు, ఆటోమేటిక్‌ ట్రాఫిక్‌ క్లాసిఫైర్‌ కౌంట్స్‌ (ఏ రకపు వాహనాలు వస్తున్నాయో కనిపెడుతుంది), ఎమర్జెన్సీ కాల్‌ బాక్స్, ట్రాఫిక్‌ కంట్రోల్‌ సెంటర్, సైన్‌ బోర్డులు ఏర్పాటు చేయనున్నట్టు హెచ్‌ఎండీఏ అధికారులు సీఎస్‌కు వివరించారు.

    వరద అంచనాకు ‘ఫ్లడ్‌ సెన్సార్‌’లు...
    వానలకు నగరంలోని రోడ్లు జలమయమవుతున్నాయి. ఆ సమయంలో ట్రాఫిక్‌ కష్టాలు వర్ణనాతీతం. ఈ ఇబ్బందులను గుర్తించేందుకు ఎక్కువగా నీరు నిలిచే ప్రాంతాల్లో ఫ్లడ్‌ సెన్సార్‌ల ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. వివిధ ప్రాంతాల్లో కాలుష్య స్థాయిని తెలుసుకునేందుకు పొల్యూషన్‌ సెన్సార్‌ల ఏర్పాటు అవసరమని అభిప్రాయపడ్డారు. సిటీ ఐటీఎస్‌ మాస్టర్‌ ప్లాన్‌లో భాగంగా ఏ బస్సు ఎక్కడుందో తెలుసుకొనేందుకు బస్సుల్లో జీపీఎస్‌లు అమర్చనున్నారు. దీనికి సంబంధించిన యాప్‌ను కూడా సిద్ధం చేస్తున్నారు.

    పార్కింగ్‌ వెతలపై దృష్టి...
    నగరంలో మరో పెద్ద సమస్య పార్కింగ్‌. దీనికి చెక్‌ పెట్టేందుకు నో పార్కింగ్, పార్కింగ్‌ రోడ్ల జాబితా ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ అధికారులను సీఎస్‌ ఆదేశించారు. అలాగే కొత్తగా మల్టీ లెవల్, ఓపెన్‌ ల్యాండ్‌ పార్కింగ్‌ల ఏర్పాటుకు సాధ్యసాధ్యాలపై దృష్టి సారించాలని కాంప్రహెన్సివ్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ స్టడీ (సీటీఎస్‌) సిబ్బందికి సూచించారు. సమావేశంలో హెచ్‌ఎండీఏ కమిషనర్‌ చిరంజీవులు, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు సందీప్‌ శాండిల్యా, మహేష్‌ భగవత్, నగర ట్రాఫిక్‌ అదనపు పోలీసు కమిషనర్‌ జితేందర్, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఎండీ ఎన్‌వీఎస్‌ రెడ్డి పాల్గొన్నారు.  

    బీఆర్‌టీఎస్‌తో మేలు
    అహ్మదాబాద్‌లో విజయవంతంగా అమలవుతున్న బస్‌ ర్యాపిడ్‌ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్‌ (బీఆర్‌టీఎస్‌)ను అధ్యయనం చేసిన హెచ్‌ఎండీఏ అధికారులు... నగరంలో దీని అమలు సాధ్యాసాధ్యాలపై చర్చించారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బీఆర్‌టీఎస్‌ బస్సుల కోసం డివైడర్‌కు రెండు వైపులా 3.5 మీటర్ల చొప్పున ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేస్తారు. ఈ లైన్లలోకి ఇతర వాహనాలు రాకుండా చూడటం ద్వారా ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పి, బస్సుల వేగం పెరుగుతుంది.

మరిన్ని వార్తలు