పెన్షనర్లకు ఇప్పటికీ నిరీక్షణే

31 Jan, 2016 04:59 IST|Sakshi
పెన్షనర్లకు ఇప్పటికీ నిరీక్షణే

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ బకాయిలను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడంతో దాదాపు 8 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులు గ్రాట్యుటీ బకాయిలు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారు. పీఆర్‌సీ సిఫారసుల ప్రకారం రిటైరైన ఉద్యోగులకు ఇచ్చే గ్రాట్యుటీని భారీగా పెంచిన ప్రభుత్వం... బకాయిల చెల్లింపులపై మాత్రం ఉలుకూ పలుకూ లేనట్లుగా వ్యవహరిస్తోంది. రిటైరైన ఉద్యోగులకు గతంలో రూ. 8 లక్షలున్న గ్రాట్యుటీని రూ. 12 లక్షలకు పెంచుతూ గత ఏడాది జూలైలోనే ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు...తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి పెరిగిన గ్రాట్యుటీ వర్తిస్తుందని ప్రకటించింది.

2015 మార్చి నుంచి రిటైరైన వారికి నగదు రూపంలో గ్రాట్యుటీ చెల్లిస్తామని, 2014 జూన్ 2 నుంచి 2015 ఫిబ్రవరి 28 మధ్య రిటైరైన ఉద్యోగులకు గ్రాట్యుటీ వ్యత్యాస బకాయిలు చెల్లిస్తామని పేర్కొంది. వీటికి సంబంధించి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని సర్కారు తెలిపింది. కానీ ఆరు నెలలు కావస్తున్నా ఈ ఉత్తర్వులు జారీ చేయకుండా ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టడంతో బకాయిలు పొందాల్సిన పెన్షనర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. తమ తర్వాత రిటైరైన ఉద్యోగులకు పెరిగిన గ్రాట్యుటీ చెల్లించిన ప్రభుత్వం తమకు ఇస్తామన్న బకాయిలు ఇవ్వకపోవటంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీరందరికీ రూ. 8 లక్షల గ్రాట్యుటీ చెల్లించామని, వ్యత్యాస బకాయిల ఫైలు పెండింగ్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. గ్రాట్యుటీ బకాయిలు చెల్లించేందుకు దాదాపు రూ. 200 కోట్లు కావాల్సి ఉండటం, కొత్త బడ్జెట్ తయారీ నేపథ్యంలో ఈ చెల్లింపుల ఫైలు మరో రెండు నెలల వరకు ముందుకు కదిలేటట్లు లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 వేతన బకాయిలకు మోక్షం లేనట్లే!
 ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌సీ బకాయిల చెల్లింపులకు రానున్న బడ్జెట్‌లోనైనా మోక్షం లభించడం ప్రశ్నార్థకంగా మారింది. ప్రణాళికేతర వ్యయాన్ని వీలైనంత మేరకు తగ్గించాలని సర్కారు కసరత్తు చేస్తుండటంతో బడ్జెట్‌లో బకాయిల అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. పీఆర్‌సీ ఉత్తర్వుల ప్రకారం పెరిగిన వేతనాలకు సంబంధించిన 9 నెలల బకాయిలను ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. వీటికి దాదాపు రూ. 2,500 కోట్లు అవసరమవుతాయి. ఇది భారీ మొత్తం కావటంతో ఆర్థికశాఖ బకాయిలను చెల్లించకుండా వాయిదా వేస్తూ వస్తోంది. మరోవైపు బకాయిలు నగదుగా ఇవ్వాలా లేక జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలా అనే సందిగ్ధతపై స్పష్టత లేదు. కొత్తగా చేరిన ఉద్యోగులకు జీపీఎఫ్ ఖాతాలు లేకపోవటం, పెన్షన్‌దారులకు జీపీఎఫ్ వర్తించకపోవటంతో ఈ చెల్లింపులు సంక్లిష్టంగా మారాయి. బకాయిల మొత్తంలో సగం జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలని, మిగతా సగం నగదు రూపంలో ఇవ్వాలంటూ ఉద్యోగ సంఘాలు చేసిన విజ్ఞప్తులు ప్రభుత్వం పరిశీలనలోనే నిలిచిపోయాయి.

మరిన్ని వార్తలు