చదివింది ఐదారు గంటలే..!

9 May, 2016 04:10 IST|Sakshi
చదివింది ఐదారు గంటలే..!

ఐఐటీ సీటు పొందినవారిలో ఎక్కువ మంది చదివింది రోజూ 4-7 గంటలే
 
 సాక్షి, హైదరాబాద్: తెల్లవారకముందే పుస్తకాలతో కుస్తీ షురూ.. టిఫిన్ చేస్తూ, టీ తాగుతూ.. అటు బడిలో, ఇటు ఇంట్లో చదువులే చదువులు.. ర్యాంకుల కోసం ఉరుకులు పరుగులు.. ఆటల్లేవు, పాటల్లేవు.. రాత్రి నిద్రపోయేదాకా పుస్తకాలతోనే దోస్తీ... ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ విద్యార్థిని చూసినా ఇదే తంతు. కానీ దేశంలోని అత్యుత్తమ విద్యా సంస్థల్లో ఒకటైన బాంబే ఐఐటీలో సీటు సంపాదించిన చాలా మంది విద్యార్థులు చదివింది రోజూ నాలుగు నుంచి ఏడు గంటలే! పొద్దంతా కుస్తీ పట్టడం కాకుండా.. చదివినంతసేపు శ్రద్ధగా చదివామని ఆ విద్యార్థులు ఐఐటీ నిర్వహించిన సర్వేలో వెల్లడించారు. బాంబే ఐఐటీలో ఎక్కువ మంది మహారాష్ట్ర విద్యార్థులుకాగా.. తెలంగాణ విద్యార్థులు నాలుగో స్థానంలో ఉన్నారు.

 తల్లిదండ్రులకూ టెన్షన్!
 తమ పిల్లలు ఐఐటీల్లో చదవాలన్నది ఎంతో మంది తల్లిదండ్రుల కల. పిల్లల్ని 6వ తరగతి నుంచే ఐఐటీ కోచింగ్ ఇచ్చే స్కూళ్లలో చేర్చుతున్నారు. ఆటపాటలు మాన్పించేసి, చదువుపైనే శ్రద్ధ పెట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. పదో తరగతి పూర్తయిందంటే చాలు.. ఈ చదువుల ఒత్తిడి మరింత పెరిగిపోతోంది. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయేదాకా పుస్తకాలతో స్నేహమే. ఇలాంటి పరిస్థితులపై అభిప్రాయం తెలుసుకునేందుకు 2015-16 విద్యా సంవత్సరంలో తమ వద్ద చేరిన విద్యార్థులపై బాంబే ఐఐటీ ఓ సర్వే నిర్వహించింది. విద్యార్థుల ఆలోచనలు, ఆకాంక్షలు, ఐఐటీ కోసం ప్రిపేరైన తీరు, తల్లిదండ్రుల ఆలోచనలు, చదివించేందుకు వారు పడిన ఆరాటం.. ఇలా ప్రతి కోణంలో విద్యార్థుల మనసు తెలుసుకుంది. దానిని ‘ఇన్‌సైట్ ఫ్రెషర్స్ సర్వే’ పేరుతో విడుదల చేసింది.

 సహపాఠ్య కార్యక్రమాలపై ఆసక్తి తక్కువ
 జేఈఈ కోసం సిద్ధమయ్యే విద్యార్థులు ఆటపాటలు వంటి సహపాఠ్య కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనికి తల్లిదండ్రుల ఒత్తిడి, ఎక్కువ సమయం చదవాలన్న ఆలోచనే కారణం. సర్వేలో పాల్గొన్నవారిలో 23.8 శాతం మంది అసలు ఆటపాటలపై దృష్టే పెట్టలేదని వెల్లడించారు. సహపాఠ్య కార్యక్రమాలకు గంట కంటే తక్కువ సమయం వెచ్చించిన వారు 31.5 శాతం, గంట నుంచి రెండు గంటలపాటు వెచ్చించిన వారు 28.2 శాతం ఉండగా... రెండు గంటల కంటే ఎక్కువ సమయం వెచ్చించిన వారు 16.5 శాతం మంది.

► జేఈఈకి సిద్ధమయ్యే వారికి మానసిక కౌన్సెలింగ్ అవసరమని 26.1 శాతం మంది విద్యార్థులు చెప్పగా, 73.9 శాతం మంది అవసరం లేదన్నారు.
► తమ ఆసక్తితో జేఈఈకి ప్రిపేరయ్యామని ఎక్కువ మంది చెబుతున్నా. తల్లిదండ్రుల ఒత్తిడితో సిద్ధమయ్యామని 18.8 శాతం, బంధువుల ఒత్తిడితో 16.5 శాతం మంది, ఉపాధ్యాయుల సూచనలతో 19.6 శాతం మంది జేఈఈ రాశారు.
► పాఠశాల విద్య స్థాయిలో 26 శాతం మంది ఏ దశలోనూ కాపీ కొట్టలేదని చెప్పారు. మిగతా 74 శాతం మంది ఏదో ఒక స్థాయిలో కాపీ కొట్టామని, టీచర్లు చెబితే రాశామని చెప్పారు.
► ఐఐటీల్లో సీట్లు పొందిన వారిలో 95.9 శాతం మంది జేఈఈ శిక్షణ పొందినవారు కాగా... 4.1 శాతం మంది శిక్షణ లేకుండానే సీట్లు సాధించారు.
► టాప్ 1000 ర్యాంకులు సాధించిన  వారిలో 40 శాతం మంది రాష్ట్ర బోర్డులకు చెందినవారు.. 60 శాతం మంది సీబీఎస్‌ఈ బోర్డుకు చెందినవారు.
 
 సర్వేలోని ప్రధాన అంశాలు
 ► ఒకటి నుంచి 100 వరకు ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో 25%మంది రోజుకు 4 గంటల పాటే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ప్రిపేరయ్యారు. 40 శాతం మంది 4 నుంచి 7 గంటల సమయం కేటాయించారు. 15 శాతం మంది 7 నుంచి 10 గంటలు, మరో 15 శాతం మంది 10 నుంచి 12 గంటల పాటు ప్రిపేరయ్యారు. అంతకుమించి చదివినవారు 5 శాతమే.
►101 నుంచి 1000 వరకు ర్యాంకులు సాధించిన వారిలో 4 గంటల కన్నా తక్కువ సమయం చదివినవారు 7 శాతంకాగా... నాలుగు నుంచి ఏడు గంటలపాటు చదివినవారు 47 శాతం. ఇక 7 నుంచి 10 గంటలపాటు చదివిన వారు 26 శాతం, 10 నుంచి 12 గంటలపాటు ప్రిపేరైన వారు 17 శాతం, అంతకంటే ఎక్కువ సమయం చదివినవారు 2%విద్యార్థులే.
► 1001 నుంచి 2,500 ర్యాంకు వరకు సాధించిన వారిలో చదవడం కోసం 37శాతం నాలుగు గంటలలోపే కేటాయించారు. 40 శాతం మంది నాలుగు నుంచి ఏడు గంటలపాటు సిద్ధమయ్యారు. 7-10 గంటలు చదివినవారు పది శాతం, 10-12 గంటలు చదివిన వారు 11 శాతం, అంతకంటే ఎక్కువ చదివిన వారు కేవలం ఒక శాతమే ఉన్నారు.
► 2501వ ర్యాంకు నుంచి ఐదు వేల ర్యాంకు వరకు వచ్చిన వారిలో 30 శాతం మంది నాలుగు గంటల పాటే చదివారు. 42 శాతం మంది 4 నుంచి 7 గంటల పాటు చదివారు. 16 శాతం మంది ఏడు నుంచి పది గంటలు, ఐదు శాతం మంది పది నుంచి 12 గంటలు, 7 శాతం అంతకంటే ఎక్కువ సమయం వెచ్చించారు.

మరిన్ని వార్తలు