నగ్న చిత్రాలతో టీడీపీ ఎంపీ అనుచరుల బెదిరింపులు

18 May, 2016 01:32 IST|Sakshi
నగ్న చిత్రాలతో టీడీపీ ఎంపీ అనుచరుల బెదిరింపులు

♦ జాతీయ బాలల హక్కుల కమిషన్‌ను ఆశ్రయించిన బాలికల తండ్రి
♦ ఎంపీ తోట సహా మరో ఆరుగురి అరెస్ట్‌కు ఆదేశాలు
 
 హైదరాబాద్ / కాకినాడ లీగల్:  స్థల వివాదంలో ఓ కుటుంబాన్ని భయాందోళనలకు గురిచేసేందుకు టీడీపీ ఎంపీ తోట నర్సింహం అనుచరులు నీచానికి ఒడిగట్టారు. ఆ స్థల యజమాని మైనర్ కుమార్తెల నగ్న చిత్రాలను చూపి బెదిరింపులకు పాల్పడ్డారు. బాధితుడి ఫిర్యాదుతో జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ తీవ్రంగా స్పందించింది. 24 గంటల్లో నిందితులపై ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్  ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్’ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ కమిషన్ ఆదేశించిందని ఉమ్మడి రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ సంఘం సభ్యుడు అచ్యుతరావు, బాధితుడు రవికుమార్ వెల్లడించారు.

హైదరాబాద్‌లో అచ్చుతరావు, కాకినాడలో బాధితుడు రవికుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా మాధవపట్నానికి చెందిన నాయ్యవాది సూరవరపు వెంకట రవికుమార్‌కు కాకినాడ టౌన్, రూరల్ ప్రాంతాల్లో రూ.కోట్లు విలువైన భూమి ఉందన్నారు. దీన్ని తక్కువ మొత్తం ఇచ్చి కాజేయాలని ఎంపీ తోట భావించారని, అనుచరులను పంపి పలుమార్లు ఒత్తిడి చేసినా రవికుమార్ స్పందించలేదన్నారు. ఎంపీ అండదండలతో అతని బంధువులైన కోన విశ్వేశ్వరయ్య అలియాస్ శ్రీరామయ్య, బొండా సూర్యరావు, చక్కపల్లి సత్యనారాయణ, చక్కపల్లి గణేష్, చక్కపల్లి రమణ బెదిరించి వేధింపులకు గురిచేస్తున్నారన్నారు.

ఈ నేపధ్యంలో రవికుమార్ పెద్దకుమార్తె ఆరోగ్యం బాగుండక పోవడంతో కాకినాడలోని మమత స్కానింగ్‌సెంటర్‌కు తీసుకువెళ్ళగా ఎక్స్‌రే తీస్తానని, బట్టలు మార్చుకోమని చెప్పి అప్పట్లో నగ్న దృశ్యాలు తీశారన్నారు. అలాగే ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో చదువుతున్న చిన్నకుమార్తెను అబద్ధం చెప్పి సెలవు రోజు స్కూల్‌కు రప్పించిన టీచర్ తోట సత్యానందం మేడపైకి తీసుకువెళ్ళి నగ్నంగా ఫొటోలు తీశారన్నారు. వాటిని వాట్సాప్‌లో ఎంపీ అనుచరుల గ్రూపుల్లో పెట్టి ఆస్తులు అమ్మకపోతే ఈ దృశ్యాలను ఫేస్‌బుక్‌లో, యూట్యూబ్‌లో పెడతామని బెదిరించారన్నారు. ఈ విషయమై కాకినాడ ఎస్పీ, డీఎస్పీ, సిఐలకు ఫిర్యాదు  చేసినా పట్టించుకోకపోవడంతో సీఐడీ అడిషనల్ డెరైక్టర్ జనరల్‌కు ఫిర్యాదు చేశామన్నారు.

అయినా ఫలితం లేక జనవరి 24న జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. కమిషన్ సభ్యులు సుమారు నాలుగు నెలలపాటు ప్రాథమిక విచారణ చేపట్టి సోమవారం సమయంలో స్పీడ్ పోస్టు ద్వారా సీఎం చంద్రబాబుకు, తమకు నోట్‌ను పంపారన్నారు. ఈ నోట్ ఆధారంగా 24 గంటల్లో నిందితులపై ‘ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్’ కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలంటూ ఆదేశించిందన్నారు. ఈ ఘట నపై హోం ముఖ్య కార్యదర్శి, డీజీపీ రాముడులను బాధ్యులను చేస్తూ కమిషన్ నోటీసులు పంపిందని అచ్యుతరావు తెలిపారు. తూర్పుగోదావరి ఎస్పీ రవిప్రకాష్‌కు ఫోన్ ద్వారా విషయాన్ని వివరించి కమిషన్ ఆదేశాలు అమలు చేయాలని కోరినట్లు చెప్పారు.

 మానసిక స్ధితి సరిగాలేదు
 రవికుమార్ మానసికస్ధితి సరిగాలేదని కాకినాడ డీఎస్‌పీ ఎస్.వెంకటేశ్వరరావు మంగళవారం చెప్పారు. గతంలో రవికుమార్ ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు. అతను చేస్తున్న ఆరోపణల్లో నిజంలేదన్నారు. మానవ హక్కుల సంఘానికి సంతకం లేకుండా ఫిర్యాదు చేయగా ఆ ఫిర్యాదును తిరస్కరించారని తెలిపారు. ఎంపీ తోట నర్సింహంపై చేసిన ఆరోపణలు అవాస్తవమని, ఊహాజనితంగా మాట్లాడుతున్నాడని డీఎస్‌పీ వెంకటేశ్వరరావు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు