ఎన్టీఆర్‌ గురించి నీకేం తెలుసు?

18 Jan, 2017 03:03 IST|Sakshi
ఎన్టీఆర్‌ గురించి నీకేం తెలుసు?

► రేవంత్‌ను ప్రశ్నించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌
► పార్టీ మారినప్పుడు ఎన్టీఆర్‌కు మొక్కి వెళ్లావా?: రేవంత్‌

సాక్షి, హైదరాబాద్‌: దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ గురించి టీడీపీ నేత ఎ.రేవంత్‌రెడ్డి, టీడీపీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ మధ్య అసెంబ్లీ లాబీల్లో మంగళ వారం ఆసక్తికరమైన సంవాదం జరిగింది. లాబీల్లో ఎదురైన సందర్భంగా ఎన్టీఆర్‌ వర్ధంతిని అధికారికంగా నిర్వహించాలని టీటీడీపీ డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌ గురించి నీకేం తెలుసని రేవంత్‌రెడ్డిని గోపీనాథ్‌ ప్రశ్నించారు. వారి మధ్య సంవాదం ఇలా..

రేవంత్‌: ఎన్టీఆర్‌ గురించి నాకు తెలియదు. కనీసం ఆయనను దగ్గర నుంచి కూడా చూడలేదు.
గోపీ: పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షునిగా కొత్త చాంబర్‌లోకి పెద్దమ్మ గుడి దగ్గర నుంచి వెళ్లావు. అభిమానముంటే ఎన్టీఆర్‌ ఘాట్‌ నుంచి వెళ్లేవాడివి కదా.

రేవంత్‌: టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచావు. పార్టీ ఫిరాయించి టీఆర్‌ఎస్‌లో చేరేముందు ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లి మొక్కి వెళ్లావా?
గోపీ: నేను నేరుగా అసెంబ్లీకే వచ్చాను.

రేవంత్‌: పెద్దమ్మ గుడి నుంచి బయలుదేరినా ఎన్టీఆర్‌ భవన్ కే వెళ్లాను.
గోపీ: ఎన్టీఆర్‌ కొడుకులు, కూతుళ్లే పార్టీ మారారు. నాకు 8 నెలలపాటు గన్ మన్లను ఇవ్వలేదు. అయినా పార్టీ పట్టించుకోలేదు.

రేవంత్‌: అప్పుడు వర్కింగ్‌ ప్రెసిడెంటు, టీటీడీపీ ఫ్లోర్‌లీడర్‌గా ఉన్న ఎర్రబెల్లి దయాకర్‌రావు కూడా ఇప్పుడు టీఆర్‌ఎస్‌లోనే ఉన్నాడు. టీఆర్‌ఎస్‌లో చేరిన నువ్వు కూడా ఎన్టీఆర్‌ గురించి మాట్లాడితే ఎట్లా, నియోజక వర్గంలోని ఎన్టీఆర్‌ విగ్రహం పక్కన ఉన్న టీడీపీ దిమ్మెకు గులాబీ రంగు పూయించావు.
గోపీ: స్థానిక నేతలు రంగు మారిస్తే నేను బాధ్యుడినా?

రేవంత్‌: ఎన్టీఆర్‌పై గౌరవం ఉంటే ఆ దిమ్మెను వదిలేసి, మరొకటి కట్టుకోవచ్చుకదా.
ఈ సంవాదంపై ఆసక్తితో లాబీల్లోని వారంతా గుంపుగా చేరుతుండటంతో ఇద్దరూ తమ వాదనను ఆపివేసి, అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మరిన్ని వార్తలు