స్నాచర్ల వేటలో దిట్ట

3 Jun, 2016 00:58 IST|Sakshi
స్నాచర్ల వేటలో దిట్ట

టాస్క్‌ఫోర్స్  హెచ్‌సీ వెంకటస్వామి నేపథ్యమిది
సర్వోన్నత పోలీసు పతకం  పొందిన ఇద్దరిలో ఒకడు
‘ఆ 29’ మందిలో నలుగురు సీసీఆర్బీ సిబ్బందే

 

సిటీబ్యూరో:  స్నాచర్  పేరు చెప్తే నగరవాసులకు హడల్.. అలాంటి ఎందరో ఘరానా స్నాచర్లను పట్టుకున్న ఘనుడు ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌లో హెడ్-కానిస్టేబుల్‌గా పని చేస్తున్న పి.వెంకట స్వామి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ప్రభుత్వం బుధవారం 245 మంది పోలీసు అధికారులు, సిబ్బందికి వివిధ రకాలైన పతకాలు ప్రకటించింది. మొత్తం నాలుగు కేటగిరీల్లో వీటిని ప్రకటించగా... ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పతకం కేవలం ఇద్దరికి మాత్రమే దక్కింది. వీరిలో ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ ఎం.రామకృష్ణతో పాటు హెచ్‌సీ వెంకటస్వామి ఉన్నారు. తూర్పు మండల టాస్క్‌ఫోర్స్ బృందం ఏడాది కాలంలో మొత్తం 390 స్నాచింగ్ కేసుల్ని కొలిక్కి తెచ్చింది. వీటిలో 370 కేసులు కేవలం వెంకటస్వామి సేకరించిన సమాచారంతోనే పరిష్కారమయ్యాయి. 232 స్నాచింగ్స్ చేసిన లాంబ, వందకు పైగా చేసిన బాకర్ అలీ ఇరానీ, అంజద్ అలీ ఇరానీతో పాటు మరెందరినో పట్టుకోవడంలో కీలకపాత్ర పోషించారు.


ఏడాది కాలంలో దాదాపు 30 అటెన్షన్ డైవర్షన్ గ్యాంగులకు సంబంధించిన సమాచారాన్నీ సేకరించిన వెంకటస్వామి వారికీ చెక్ చెప్పాడు. ఈ సేవల్ని గుర్తించిన అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి, ఇన్‌స్పెక్టర్ సీహెచ్ శ్రీధర్  హెడ్-కానిస్టేబుల్ వెంటకస్వామి పేరును ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పతకానికి సిఫార్సు చేయడంతో ఆయన ఎంపికయ్యారు. మరోపక్క పోలీసు సేవా పతకం పొందిన వారిలో 29 మంది హైదరాబాద్ కమిషనరేట్‌కు చెందిన వారున్నారు. వీరిలో నలుగురు నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్) ఆధీనంలోని సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (సీసీఆర్బీ)లో పని చేస్తున్న వారే. అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్లు సర్దార్ తేజేందర్ సింగ్, సయ్యద్ సాధిక్ అహ్మద్, హెడ్-కానిస్టేబుళ్లు ముఫ్తా ఉద్దీన్, బి.జయలక్ష్మి సీసీఆర్బీలోనే పని చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు