-

పొంగుతోంది.. పాతాళగంగ!

16 Jul, 2017 04:01 IST|Sakshi
పొంగుతోంది.. పాతాళగంగ!
- రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టం (సగటు) 11.27మీటర్లు 
గతేడాది కంటే ఎత్తుకు పెరిగిన నీటి మట్టం 3.76మీటర్లు 
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో భూగర్భ జలాల మట్టం గతేడాదితో పోల్చితే కాస్త మెరుగుపడింది. 2016లో ఇదే సమయంలో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో పాతాళగంగ మరింత కిందికి వెళ్లిపోయింది. తర్వాత ఆగస్టు నుంచి వర్షాలు ఆశాజనకంగా కురిసినా భూగర్భ జల మట్టాల్లో మార్పులు పెద్దగా కనిపించలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 584 మండలాల్లోని పరిస్థితిపై భూగర్భ జల శాఖ నివేదిక విడుదల చేసింది. ఇందులో 266 మండలాల్లో 10 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జలాలున్నాయి. 175 మండలాల్లో పదిహేను మీటర్ల లోతులో నీటిమట్టాలుండగా.. 83 మండలాల్లో ఇరవై మీటర్ల లోతులో ఉన్నాయి.

20 మీటర్ల కంటే ఎక్కువ లోతులో నీటి మట్టాలున్న మండలాలు 60 ఉన్నట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గతేడాది జూన్‌లో రాష్ట్రంలో సగటున 15.03 మీటర్ల లోతులో నీరు లభ్యమవగా... ప్రస్తుతం 11.27 మీటర్ల లోతులో భూగర్భ జలాలున్నాయి. అతి తక్కువ లోతులో జగిత్యాల జిల్లా (7.33 మీటర్లు), ఎక్కువ లోతులో సంగారెడ్డి (17.03 మీటర్లు) జిల్లాలో నీటి లభ్యత ఉంది. ప్రస్తుతం నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సగటు కంటే ఎక్కువ లోతులో నీరున్నట్లు అధికారులు చెబుతున్నారు. జోగులాంబ గద్వాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, వరంగల్‌ ఆర్బన్, ఖమ్మం జిల్లాల్లో సగటున 8 మీటర్ల కంటే తక్కువ లోతులో భూగర్భ జలం లభ్యమవుతోంది. 
మరిన్ని వార్తలు