కొబ్బరి ‘ధర’హాసం!

7 Feb, 2015 00:06 IST|Sakshi
కొబ్బరి ‘ధర’హాసం!

భారీగా పెరిగిన ధరలు
రిటైల్ మార్కెట్లో రూ.20 పైమాటే
నగరానికి తగ్గిన సరఫరా

 
గ్రేటర్‌లోని దేవుళ్లు కొబ్బరికాయలు కొట్టే భక్తుల కోసం ఎదురు చూసే పరిస్థితి వచ్చింది. నిన్న మొన్నటి వరకూ ఆలయాల్లోని దేవుళ్లకు భారీ ఎత్తున కొబ్బరి నీటితో అభిషేకం చేసి...ఆ ముక్కలను నైవేద్యంగా పెట్టే భక్తులు... ప్రస్తుతం అరటి పండ్లనో... మరో రూపంలోనో ప్రసాదం పెట్టి మమ అనిపించేస్తున్నారు. సామాన్యులైతే  ‘ఈసారికి దండంతో సరిపెట్టుకో’మంటూ దేవుళ్లకు సర్ది చెప్పే పనిలో పడ్డారు. ఇదంతా అతిశయోక్తిలా అనిపించినా... దీని వెనుకనున్న వాస్తవం విస్మరించలేనిది. కొబ్బరి ధరల పెరుగుదల తీవ్రతను చాటిచెప్పేది.
 
సిటీబ్యూరో:  గ్రేటర్ హైదరాబాద్‌లో కొబ్బరి కాయల ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ఇవి రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి సరఫరా తగ్గిపోవడంతో వీటికి కొరత ఏర్పడింది. డిమాండ్-సరఫరాల మధ్య అంతరంతో గత 15 రోజులుగా కొబ్బరి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. సంక్రాంతి పండుగ నాడు రూ.10 ఉన్న కొబ్బరికా య ధర ఇప్పుడు రెట్టింపైంది. నగరంలోని హోల్‌సేల్ దుకాణాల్లో గురువారం 100 కొబ్బరికాయలు రూ.1500 వంతున ప్రకారం విక్రయించారు. రిటైల్ మార్కెట్లోఒక్కో కొబ్బరికాయ (చిన్న సైజ్) ధర రూ.20...   మీడియం సైజ్ కాయ రూ.22కు పైగా పలికింది. ఇక పెద్ద కొబ్బరి కాయల ధర ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ధరలు నగరమంతటా ఒకేలా లేవు. గిరాకీ, భక్తుల రద్దీని బట్టి ఒక్కో ఆలయం వద్ద ఒక్కో రకంగా వ్యాపారులు వసూలు చేస్తున్నారు. వీరి దోపిడీని అరికట్టే వారే ఉండడం లేదు. పెరిగిన ధరలను చూసి భక్తులు దేవునికి పండ్లు, పూలతో సరిపెడుతున్నారు.

గుడికె ళ్లి కొబ్బరికాయ కొట్టకపోతే ఏదో వెలితిగా ఉందంటూ  భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కొన్ని రకాల వంటకాలకు ఎంత ధరైనా పెట్టి కొబ్బరి కాయలను కొనుగోలు చేయాల్సి వస్తోందని క్యాటరింగ్ సంస్థల నిర్వాహకులు చెబుతున్నారు. హోటళ్ల మెనూల్లో కొబ్బరి చెట్నీకి ప్రత్యామ్నాయంగా అల్లం, చింతపండు తదితర పచ్చళ్లను మార్పు చేశారు. ఇళ్లలోనూ కొబ్బరి చెట్నీకి కరువొస్తోంది.

ఎందుకిలా?

 హైదరాబాద్ నగరానికి ఉభ య గోదావరి, విశాఖ జిల్లాలు, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి కొబ్బరికాయలు దిగుమతి అవుతుంటాయి. అత్యధికంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచే వస్తాయి. అక్కడ వాతావరణం అనుకూలించకపోవడం... నల్లి తెగులు సోకడంతో పంట దిగుబడి దారుణంగా పడిపోయినట్టు సమాచారం. దీనికి తోడు కొబ్బరి బోండాలకు మంచి డిమాండ్ ఉండటం... గిట్టుబాటు ధర వస్తుండటంతో చాలామంది రైతులు మధ్యలోనే పంట దించుతుండటంతో కొబ్బరికాయల ఉత్పత్తి తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే విశాఖ జిల్లాలో ఇటీవల సంభవించిన హుద్‌హుద్ తుపాన్ ప్రభావంతో కొబ్బరి తోటలు తుడిచిపెట్టుకు పోయాయి. ఆమేరకు నగరానికి కొంతమేర సరఫరా తగ్గిపోయింది. తూర్పు గోదావరి జిల్లాలోని అంబాజీపేట, రాజోలు, రావులపాలెంలలోనే కొబ్బరికాయలకు మంచి రేటు పలుకుతుండటంతో స్థానిక రైతులు, వ్యాపారులు నగరం వైపు చూడడం లేదు.


 ఇక తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో టన్ను కొబ్బరికాయల ధర రూ.33 వేలు పలుకుతోంది. అక్కడ 100 కాయల ధర రూ.1800 వరకు ఉండటంతో నగరానికి దిగుమతి చేసుకొనేందుకు వ్యాపారులు ఇష్టపడట్లేదు. ఒకవేళ కొనుగోలు చేసినా సరుకు రవాణా, లోడింగ్/అన్‌లోడింగ్ వంటి వాటికి లారీకి రూ.5వేల వరకూ అదనంగా ఖర్చవుతుండడంతో వారు వెనుకడుగు వేస్తున్నారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల పైనే నగర కొబ్బరి మార్కెట్ ఆధారపడుతోంది. అక్కడి నుంచి సరఫరా తగ్గిపోవడంతో ఇక్కడ డిమాండ్... ధరలపై ప్రభావం పడుతోంది.
 

మరిన్ని వార్తలు