వేగంగా మదింపు.. సత్వరమే పరిహారం!

26 Dec, 2015 02:55 IST|Sakshi
వేగంగా మదింపు.. సత్వరమే పరిహారం!

ముంపు ప్రాంతాల గృహ నిర్మాణ పరిహారంలో కొత్త విధానం
♦ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో శ్రీకారం
♦ గతంలో మాదిరి ఇంటింటి సర్వే విధానానికి స్వస్తి
♦ గుడిసె, మట్టి, మిద్దె తదితర గృహాలుగా విభజించి చదరపు అడుగుకు వెల కట్టి ధర నిర్ణయం
♦ పరిహారంలో జాప్యం నివారణకు ప్రభుత్వ కసరత్తు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి భూసేకరణ ప్రక్రియను వేగిరం చేసేందుకు చర్యలు చేపట్టిన ప్రభుత్వం.. ముంపు ప్రాంతాల్లో గృహాల పరిహారం చెల్లింపు కూడా వేగంగా జరిగేలా నూతన విధానాన్ని తీసుకురానున్నది. గతంలో ముంపు ప్రాంతాల్లో గృహాలపై పంచాయతీరాజ్, ఆర్‌అండ్ బీ శాఖల సర్వేలు, విలువను మదింపు చేసిన తర్వాత పరిహారం చెల్లించే విధానం ఉండగా... ప్రస్తుతం గృహ నిర్మాణ రకాన్ని బట్టి చదరపు అడుగును ప్రాతిపదికగా తీసుకొని సత్వరమే చెల్లింపులు చేసేలా సరికొత్త విధానాన్ని తెచ్చేందుకు యోచిస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో ఈ విధానానికి శ్రీకారం చుట్టనుంది. ఇప్పటికే 8 రకాల గృహ నిర్మాణాలను గుర్తించి, వాటికి చదరపు అడుగుకు చెల్లించే పరిహారాన్ని నిర్ణయించింది. ప్రభుత్వం ఆమోదం తెలిపిన వెంటనే ఈ విధానం అమల్లోకి రానుంది.

 ఆర్‌అండ్‌బీ నిబంధనల్లో సడలింపులు
 సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర ప్రజోపయోగ ప్రాజెక్టుల నిర్మాణంలో గృహాలు కోల్పోయేవారికి చెల్లించే పరిహారం విషయంలో ఇప్పటికే రోడ్లు భవనాల శాఖ (ఆర్‌అండ్‌బీ) కొత్త నిబంధనలను రూపొందించింది. గతంలో నీటి పారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖలు విడివిడిగా నిబంధనలను అమలు చేస్తూ రాగా, కొత్తగా భూసేకరణ చట్టం అమలులోకి వచ్చిన నేపథ్యంలో కొత్త నిబంధనావళి తెచ్చింది. దీని ప్రకారం గృహ నిర్మాణ ప్రాథమిక అంచనా మొత్తం రూ.4 లక్షలు, అంతకంటే తక్కువగా ఉంటే నిర్మాణ వైశాల్యం (ప్లింథ్ ఏరియా) రేట్ల ఆధారంగా లెక్కిస్తారు. ఆ మొత్తం రూ. 4 లక్షల కంటే ఎక్కువగా ఉంటే నిర్మాణం పూర్తి కొలతలు స్వీకరించి ఇంజనీరింగ్ అధికారులు రూపొందించే స్టాండర్డ్ షెడ్యూల్ రేట్లు(ఎస్‌ఎస్‌ఆర్) ప్రకారం లెక్క గడతారు.

అయితే ఇక్కడ ఆర్‌అండ్‌బీ శాఖ నిబంధన మేరకు రూ. 4 లక్షల కన్నా తక్కువగా ఉన్న నిర్మాణాలకు, ఎక్కువగా ఉండే నిర్మాణాలకు వేర్వేరు నిబంధనలు తెచ్చారు. ఈ విధానాన్ని పాలమూరు ప్రాజెక్టులో అమలు చేస్తే తీవ్ర జాప్యం జరుగుతుంద ంటూ నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఆర్‌అండ్‌బీ నిబంధనల మేరకు పరిహారాన్ని లెక్కించేందుకు రెవెన్యూ, ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్, అటవీ శాఖల మధ్య సమన్వయం కుదరాలని, అది సమయానుకూలంగా జరగకుంటే ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతుందని వివరించింది. ఈ దృష్ట్యా రూ.4 లక్ష ల పైచిలుకు ఉన్న గృహ నిర్మాణాలకు సైతం గృహ నిర్మాణ రకాన్ని అనుసరించి ముం దుగా నిర్ణయించిన రేట్లకు అనుగుణంగా చదరపు మీటర్ చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరింది. అందుకు అనుగుణంగా 8 రకాల గృహ నిర్మాణాలకు చదరపు మీటర్ లెక్కన ధరలను నిర్ణయించింది.

 కలపకు ధర నిర్ణయం
 ఇదే సమయంలో నిర్మాణాల్లో వాడే సాధారణ కలప, టేకు కలపకు చెల్లించే ధరలను నీటి పారుదల శాఖ నిర్ణయించింది. సాధారణ కలపతో పోలిస్తే దాదాపు రెట్టింపు ధర టేకు కలపకు చెల్లించేలా ధర నిర్ణయం చేసింది. గృహ నిర్మాణం విలువలో అందులోని కలప విలువ 25 శాతానికి మించితే... ఆ కలపను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని 100 శాతం విలువను చెల్లిస్తుంది. ఒకవేళ యజమానే ఆ కలపను తీసుకుంటే దాని విలువలో 40 శాతం మొత్తాన్ని మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తుంది. ఆ కలపను మరోప్రాంతానికి తరలించాలంటే రిహాబిలిటేషన్ అండ్ రీ సెటిల్‌మెంట్(ఆర్‌అండ్‌ఆర్) అధికారుల నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. కలప పేరుతో అక్రమంగా పరిహారం పొందకుండా ఈ ఏర్పాటు చేశారు. నీటి పారుదల శాఖ రూపొందించిన ఈ విధానానికి ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలపాల్సి ఉంది.

Read latest Hyderabad News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు