'రెండున్నరేళ్లలో 70 వేల కోట్ల అప్పులు'

13 Mar, 2017 15:31 IST|Sakshi
'రెండున్నరేళ్లలో 70 వేల కోట్ల అప్పులు'

హైదరాబాద్‌:
రాష్ట్ర బడ్జెట్ అవాస్తవంగా ఉంది..రెండున్నరేళ్లలోనే ప్రభుత్వం 70 వేల కోట్లు అప్పులు చేసిందని టీపీసీసీ ఛీఫ్‌ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆరోపించారు. దేశంలోనే ఎక్కువ అప్పులున్న రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సాధించిందని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో ఇది రాష్టానికి ప్రమాదకరంగా మారనుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వం గ్యారంటీగా ఉన్న కార్పొరేషన్ అప్పులతో కలుపుకుని మొత్తం రాష్ట్రం అప్పులు రూ.లక్ష 85 వేల కోట్లకు చేరుకుందని చెప్పారు. కమీషన్లు వచ్చే మిషన్ భగీరథ, ఇరిగేషన్ రంగాలకు నిధులు కేటాయించిన విధంగా ఫీజు రీయంబర్స్ మెంట్, దళిత గిరిజన పేదలకు మూడు ఎకరాల భూమి వంటి పథకాలకు నిధులు కేటాయించలేదని విమర్శించారు.

అర్హులైన పేదలకు మూడెకరాలివ్వడానికి ఇంకా వందేళ్లు పడుతుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. కమీషన్లు రావనే మూడెకరాల పథకంపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. వ్యవసాయంతోపాటు రుణమాఫీని చిన్నచూపు చూస్తోందని చెప్పారు. సాంఘిక సంక్షేమ రంగానికి కేటాయించిన నిధుల్లొ సగమే ఖర్చు చేశారని తెలిపారు. ప్రాధాన్య రంగాలకిచ్చిన హామీల అమలులో సర్కార్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. అడ్డగోలుగా అప్పులు చేస్తూ ప్రభుత్వం ప్రమాదకర బాటలో వెళుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు