ఇక వచ్చి పోదామంటే కుదరదు

9 Nov, 2014 00:05 IST|Sakshi
ఇక వచ్చి పోదామంటే కుదరదు

ఠాణాల్లో త్వరలో బయోమెట్రిక్ విధానం
ఆర్డర్లీ వ్యవస్థకు చెక్ పాదర్శకంగా విధి నిర్వహణ

 

పోలీసు సిబ్బంది పనివేళల్లో పారదర్శకతను పెంచేందుకు ఠాణాలలో త్వరలో బయోమెట్రిక్ విధానాన్ని తీసుకు వచ్చేందుకు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి భావిస్తున్నారు. పోలీసు స్టేషన్‌లో సిబ్బంది ఎవరు విధుల్లో ఉన్నారు.. ఎంత మంది ఉన్నారు.. ఎంత సేపు బయటికి పోయారు, ఏ సమయానికి వచ్చారు.. అనేది గుర్తించేందుకు ఈ కొత్త పద్ధతిని అమలు చేయనున్నారు. సిబ్బందికి కావాల్సిన సౌకర్యాలను ప్రభుత్వం సమకూర్చుతుండడంతో శాంతి భద్రతల అదుపు, నేరాల నివారణ, బాధితులకు సత్వర పరిష్కారంపై మరింత దృష్టి కేంద్రీకరించాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగమే ఈ బయోమెట్రిక్ విధానం. సిబ్బంది తమ విధుల్లో పారదర్శకంగా ఉండేవిధంగా ప్రతి ఠాణాలో బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కమిషనర్ చర్యలు తీసుకుంటున్నారు. ఒక్కో స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ నుంచి హోంగార్డు వరకు 50 నుంచి 90 మందికి పైగా ఉంటారు.

వీరంతా సమయానికి డ్యూటీకి వస్తున్నారా, విధులు సక్రమంగా నిర్వహిస్తున్నారా.. అనే విషయం తెలుసుకోవడం కష్టంగా మారింది. పలుకుబడి, అధికారుల అండ గల సిబ్బంది విధులకు ఆలస్యంగా రావడం, బాధితులకు అందుబాటులో ఉండకపోవడం, ఫలితంగా బాధితులు స్టేషన్ చుట్టూ చక్కర్లు కొట్టడం జరుగుతోంది. కొంతమంది సిబ్బంది అధికారుల స్వంత పనులపై వెళ్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అధికారుల పిల్లల్ని స్కూల్‌కు తీసుకుపోవడం, కూరగాయాలు తీసుకురావడం తదితర పనులకు అనధికారికంగా సిబ్బందిని వాడుకుంటున్నారనే విమర్శ కూడా ఉంది. ఇలాంటి విమర్శలకు సైతం బయోమెట్రిక్ విధానం స్వస్తి చెప్పనుంది.
 
ఇదీ ప్రస్తుత పద్ధతి..

స్టేషన్‌లో ఉన్న సిబ్బందిని రెండు షిప్టులుగా విభజిస్తారు. 24 గంటలు ఒక షిప్టులో విధులు నిర్వహించిన సిబ్బంది మరుసటి రోజు 24 గంటలు విశ్రాంతి తీసుకుంటారు. ఒక షిప్టులో డ్యూటీ పూర్తి చేసుకున్నవారు, షిప్టులో డ్యూటీకి చేరే సమయంలో స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓ రూల్‌కాల్ నిర్వహిస్తారు. ప్రతి రోజు ఉదయం 10 గంటలకు రూల్‌కాల్ ఉంటుంది. అంటే ఈ రోజు 10 గంటలకు విధుల్లో చేరిన సిబ్బంది రేపు ఉదయం 10 గంటలకు దిగిపోతారు. వీరు దిగిపోయే సమయంలో కొత్తవారు విధుల్లో చేరుతారు. రూల్ కాల్‌లో అందరూ ఉన్నారా లేరా.. అనేది స్టేషన్ హౌస్ ఆఫీసర్ పరిశీలిస్తారు. అనంతరం స్టేషన్‌లో ఉన్న హాజరు పట్టికలో సిబ్బంది డ్యూటీకి హాజరైనట్టు సంతకాలు చేస్తారు.

కొంత మంది విషయంలో..

రూల్ కాల్‌కు హాజరవుతారు, అక్కడి రిజిస్టర్‌లో సంతకం పెడతారు. ఈ రెండు పనులు కేవలం పది నిముషాల్లో పూర్తి చేసుకుని కొందరు మాయమవుతారు. తిరిగి మరుసటి రోజు డ్యూటీ దిగిపోయే సమయంలో వచ్చి యథావిధిగా రూల్ కాల్‌కు హాజరవడం పరిపాటిగా మారింది. ఇలాంటి వారికి అధికారుల అండదండలు ఉండడం, వారి సొంత పనులకు ఉపయోగించుకోవడం ఇందుకు కారణం.
 
ఇక నుంచి పారదర్శకం

బయోమెట్రిక్ యంత్రంను అమర్చడం ద్వారా డ్యూటీలో చేరే సిబ్బంది తమ వేలిముద్రలను మిషన్‌కు పెట్టాలి. తద్వారా హాజరుతో పాటు సమయం కూడా కంప్యూటర్‌లో నమోదవుతుంది. విధి నిర్వహణలో బయటికి వెళ్లాల్సి వచ్చినప్పుడు కూడా మిషన్‌పై వేలి ముద్ర పెట్టి పోవాలి. దీని ద్వారా సిబ్బంది ఎన్ని గంటలు స్టేషన్‌లో ఉన్నారు, ఎన్ని గంటలు బయట ఉన్నారు, అతని రాకపోకలు, కదలికలు బయోమెట్రిక్ విధానం ద్వారా సమయంతో పాటు తెలిసిపోతుంది. దీంతో డ్యూటీలో నిర్లక్ష్యం వహించడానికి వీలుండదు. దీని ద్వారా ప్రజలకు పోలీసు సేవలు మరింత దగ్గరవుతాయన్నది అధికారుల ఉద్దేశం.

మరిన్ని వార్తలు