'విద్యార్థులకు యూకేలో విస్తృత అవకాశాలు'

18 Mar, 2016 04:38 IST|Sakshi

హైదరాబాద్: యూకేలో భారత విద్యార్థులకు విద్యావకాశాలు విస్తృతంగా లభిస్తున్నాయని హైదరాబాద్‌లో బ్రిటిష్ హై కమిషన్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్ పేర్కొన్నారు. సెంట్రల్ యూనివర్సిటీలోని లైఫ్ సైన్స్ సెమినార్ హాల్‌లో ఈ-లెర్నింగ్‌పై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు గురువారం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా పలు విద్యా సంస్థల నుంచి ప్రతినిధులు హాజరై వివిధ అంశాలపై ప్రసంగించారు.

 

ప్రారంభ కార్యక్రమంలో అలిస్టర్ మాట్లాడుతూ భారత్, యూకే విద్యా సంబంధాలు మెరుగుపడ్డాయని, అవి మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు. యూకే ప్రభుత్వం ఇండియాతో కలిసి పలు విద్యా కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. యూకే ప్రధాని, భారత ప్రధాని పలు అంశాలపై అవగాహనకు వచ్చారని తెలిపారు. ఇరు దేశాల సంస్కృతిని తెలుసుకునే విద్యా విధానం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. బ్రిటిష్ కౌన్సిల్ ఆధ్వర్యంలో భారత్‌లోని పలు ప్రాంతాల్లో విద్యా సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు.

 

ఐఐఎం బెంగళూర్ ప్రొఫెసర్ పీడీ జోష్ మాట్లాడుతూ సాంకేతిక విద్యా విధానానికి ప్రాధాన్యం పెరిగిందని తెలిపారు. భవిష్యత్‌లో ఇంటర్నెట్ సదుపాయంతో ఇంట్లోనే చదువుకునే అవకాశం వస్తుందన్నారు. అనంతరం హెచ్‌సీయూ ఇన్‌చార్జీ వీసీ పెరియా సామి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో విదేశీ భాషలపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఈక్వల్ ప్రాజెక్ట్ ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్ జంధ్యాల ప్రభాకర్ రావు, ఈయూ ప్రాజెక్టు మేనేజర్ మంజుల కౌల్‌లు పాల్గొన్నారు.
 

 

మరిన్ని వార్తలు