బాబు సారథ్యమంటే ఇక అంతే..

30 Nov, 2016 01:34 IST|Sakshi
బాబు సారథ్యమంటే ఇక అంతే..
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ
 
 సాక్షి, హైదరాబాద్: నల్లడబ్బుతో ఎమ్మెల్సీలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోరుున సీఎం చంద్రబాబుకు పెద్ద నోట్ల రద్దుపై నియమించిన ఉప సంఘం సారథ్య బాధ్యతలు అప్పగించడం ఏమిటని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ కేంద్రప్రభుత్వాన్ని నిలదీశారు. ఉప సంఘానికి చంద్రబాబును చైర్మన్‌గా నియమించడం అంటే దొంగ చేతికి తాళాలిచ్చినట్లేనన్నారు. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎన్నో కుంభకోణాలు చేసిన చంద్రబాబు ఉపసంఘానికి చైర్మన్‌గా ఎలా ఉంటారని ప్రశ్నించారు. సీఎంల కమిటీకి చంద్రబాబు సారథ్యం వహించటంద్వారా ఆయన నేర సామ్రాజ్యం మరో 4 రాష్ట్రాలకు విస్తరిస్తుందని ధ్వజమెత్తారు. అనేక కేసుల్లో విచారణ జరగాల్సిన చంద్రబాబుకు సీఎంల కమిటీ నేతృత్వం అప్పగిస్తే దేశం సర్వనాశనమేనని, ఈ విషయంలో కేంద్రం చెవులు, కళ్లు పనిచేస్తున్నట్లు లేదని మండిపడ్డారు.