మొసలితో పోరాడి.. చెల్లెల్ని కాపాడిన బాలుడు

16 Nov, 2019 15:49 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మొసలిని చూడగానే ఎలాంటి వారైనా భయపడి పరుగులు తీస్తారు. అదే చిన్నపిల్లల గురించైతే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.. అటువైపునకు వెళ్లడానికే  జంకుతారు. కానీ ఓ బాలుడు మాత్రం అత్యంత సాహసోపేతంగా మొసలిని భయపెట్టి అందరిచేత ఔరా! అనిపించుకుంటున్నాడు. వివరాలు ఫిలిప్పైన్‌కు చెందిన హసీం(15) అనే బాలుడు తన చెల్లెలు హైనా లిసా జొసీ హబి(12)తో కలిసి బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో వారు బాంబో వంతెనను దాటవలసి వచ్చింది. అయితే మొదట హసీం వంతెన దాటి ముందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అతడి వెనకాలే వస్తున్న హైనా కూడా వంతెన దాటే క్రమంలో ఒక్కసారిగా కిందకు జారిపోయింది. ఇంతలో ఓ మొసలి హైనా కాలును పట్టుకుని నదిలోకి లాగుతుండటం గమనించిన హసీం.. వెంటనే వంతెన మీద నుంచి ముసలిపై రాళ్లు విసిరి తన చెల్లెలిని రక్షించాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న స్థానికులు అతడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఈ ఘటన గురించి హైనా మాట్లాడుతూ.. తను వంతెన దాటుతున్నప్పుడు ఏదో తన కాలును  పట్టుకుని కిందకి లాగినట్లు అనిపించడంతో వంతెనను పట్టుకున్నాడని చెప్పింది. మొసలి తన కాలును దవడలతో పట్టుకోవండంతో భయంతో బిగ్గరగా అరిచానని, వెంటనే తన సోదరుడు వచ్చి మొసలిని రాళ్లతో కొట్టి.. పైకి లాగాడని తెలిపింది. ఈ సందర్భంగా ‘అన్నయ్య నా ప్రాణాలను కాపాడాడు ఐ లవ్‌ హిమ్‌ సో మచ్‌’ అంటూ సోదరుడిపై ప్రేమ కురిపించింది. కాగా ఈ ఘటనలో హైనా కాలు లోపలికి మొసలి పళ్లు దిగి గాయమైంది. దీంతో బాలికను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.

>
మరిన్ని వార్తలు