24మంది భార్యలు.. 200మంది పిల్లలు!

26 Jun, 2016 08:43 IST|Sakshi
24మంది భార్యలు.. 200మంది పిల్లలు!

బీజింగ్ః బతికున్నంతకాలం ఆరోగ్యంగా ఉండి, జీవితకాలాన్ని వీలైనంత పెంచుకునేందుకు ప్రతివారూ ప్రయత్నిస్తూనే ఉంటారు. వారు చేసిన ప్రయత్నాలు , వారి సాధన ఒక్కోసారి తగిన ఫలితాలను కూడ ఇస్తుంటుంది. కానీ అరవై ఏళ్ళ ఆయుర్దాయం ఉండటమే కష్టంగా మారిన తరుణంలో ఓ వ్యక్తి వందేళ్ళు బతికితే ఎంతో గొప్పగా ఫీలవుతాం. నిజంగా గ్రేట్ అని సంబర పడిపోతాం. కానీ చైనాకు చెందిన ఓ వ్యక్తి 256 సంవత్సరాలు బతికాడంటే నమ్ముతారా? ఎప్పుడూ ఎవ్వరూ జీవించనంతకాలం ఆయన బతికినట్లు ఇటీవల ఓ పత్రికా కథనం ద్వారా ఆధారాలు దొరికాయి.

చైనాకు చెందిన లీ చింగ్ యన్ 1933 మే 6న మరణించాడు. అయితే అప్పటికి ఆయన వయసు 256 ఏళ్ళని, అన్నేళ్ళు జీవించడం చరిత్రలోనే మొదటిసారి అని ఓ పత్రిక తన వ్యాసంలో పేర్కొంది. ఆ సుదీర్ఘ వయస్కుడి వివరాలు ఏ ఒక్కరో శోధించినవి కాదని, ఆయన అన్నేళ్ళు బతికాడనేందుకు ఎన్నో సాక్ష్యాధారాలను సేకరించి మరీ నిర్థారించింది. లీని ఆయన 150వ పుట్టినరోజు సందర్భంగా 1827 లో అభినందిచినట్లు ఓ డాక్యుమెంటేషన్ లో చెంగ్డూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ వు చుంగ్ రాశారని,  చైనా ప్రభుత్వ రికార్డుల్లోనూ లీ చింగ్ 150వ పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలిపినట్టు ఉందని, అనంతరం ఆయన 200 పుట్టినరోజు సందర్భంగా 1877లోనూ లీని అభినందిస్తూ ఎన్నో వ్యాసాలు, పత్రాలు వెలువడ్డాయని తెలుస్తోంది. ఆయనకు పొరుగునే ఉన్న ఓ వ్యక్తి... తమ చిన్ననాటినుంచే ఆయన్ను వృద్ధుడుగా చూసినట్లు తెలిపినట్లు సదరు పత్రిక వెల్లడించింది.

సిచుయాన్ ప్రాంతంలో జన్మించిన లీ చింగ్ పదేళ్ళ వయసునుంచే ఆయుర్వేద మూలికలు సేకరిస్తూ అనేక ప్రాంతాల్లో తిరిగాడట. ఆ సమయంలో దాదాపు నలభై ఏళ్ళ పాటు అడవుల్లో దొరికే మూలికలు, గోజీపండ్లు వంటి ఆహారాన్నే భుజించాడట. ఆయుర్వేద వైద్యుడిగా అనేకచోట్ల కాలం గడిపిన ఆయన.. 71 ఏళ్ళ వయసులో 1749 లో చైనీస్ సైన్యం లో యుద్ధ కళల శిక్షకుడిగా, సలహాదారుడుగా చేరాడు. తర్వాత కనీసం వంద సంవత్సరాల పాటు ఆయన మంచి ఆహారంతోపాటు, ఔషధాలు, రైస్ వైన్ తీసుకున్నాడు. తన కమ్యూనిటీలో ప్రత్యేక సభ్యుడుగా ఉండే లీ.. 23 సార్లు వివాహం చేసుకోవడంతోపాటు, సుమారు 200 మంది పిల్లలకు తండ్రి అయ్యాడట. కుటుంబంలో 11 తరాలను చూసిన ఆయన... 1933లో మరణించాడు.  ఆయన్ను ఎవరైనా తన సుదీర్ఘ జీవితకాలం గురించి సీక్రెట్ ఏమిటి అని అడిగితే మాత్రం... నిశ్శబ్దమైన మనసుతో ఉండి, తాబేలులా కూర్చొని, పావురంలా హుషారుగా పరిగెడుతూ, కుక్కలా నిద్రపోవడమే కారణమని చెప్పేవాడట. ఆయన పుస్తకంలో (జీవితం) ఒక పేజీ చదివినా... ఈ కాలంవారికి ఎంతో స్ఫూర్తిదాయకం అయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు