ఐరాసలో తొలిసారిగా అంబేడ్కర్ జయంతి

15 Apr, 2016 03:53 IST|Sakshi
ఐరాసలో తొలిసారిగా అంబేడ్కర్ జయంతి

అంబేడ్కర్ ఆశయాల సాధనకు భారత్‌తో కలసి కృషి: క్లార్క్
 
 ఐరాస: భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి వేడుకలను ఐక్యరాజ్యసమితి (ఐరాస) తొలిసారిగా నిర్వహించింది. ఐరాసలో సివిల్ సొసైటీ అడ్వొకసీ గ్రూప్స్ కల్పనా సరోజ్ ఫౌండేషన్, ఫౌండేషన్ ఆఫ్ హ్యూమన్ హారిజన్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన అంబేడ్కర్ 125వ జయంతి వేడుక లకు ఐరాస అభివృద్ధి కార్యక్రమం (యూఎన్‌డీపీ) నిర్వాహకురాలు, న్యూజిలాండ్ మాజీ ప్రధాని హెలెన్ క్లార్క్ అధ్యక్షత వహించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రముఖ భారత సామాజిక సంస్కర్త అయిన అంబేడ్కర్ ఆశయాలను నెరవేర్చేందుకు భారత్‌తో కలసి ముందుకు నడవనున్నట్లు తెలిపారు.

‘మేం 2030 అభివృద్ధి ఎజెండా సాధనకు, అంబేడ్కర్ ఆశయాల మేరకు ప్రపంచ వ్యాప్తంగా పేద, అట్టడుగు వర్గాల కోసం భారత్‌తో కలసి కృషి సాగిస్తాం’ క్లార్క్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాల ఆర్థిక, సామాజిక ప్రగతికి సవాళ్లుగా నిలిచిన అసమానతలను అర్థం చేసుకున్న మహోన్నతుడు అంబేడ్కర్ అని కొనియాడారు. వెలివేతకు గురైన వర్గాల సాధికారిత కోసం, కార్మిక చట్టాల సంస్కరణకు, మెరుగుదలకు, అందరికీ విద్య కోసం అంబేడ్కర్ చేసిన కృషి ప్రశంసనీయమైనదని అన్నారు. ఈ సందర్భంగా ‘స్థిర అభివృద్ధి ఆశయ సాధనకు అసమానతలపై పోరు’ అన్న అంశంపై ప్యానల్ డిస్కషన్ జరిగింది. అంబేడ్కర్ జీవితం, పోరాటం, ఆశయాలు తదితర అంశాలపై 14 నిమిషాల సేపు సాగిన వీడియోను ప్రదర్శించారు. ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ మాట్లాడుతూ ఐరాస చేపట్టిన 2030 అభివృద్ధి ఎజెండాలోనూ అంబేడ్కర్ దృక్పథం కనబడుతుందన్నారు.
 
 సమానత్వ దినోత్సవంగా ప్రకటించాలి
 అంబేడ్కర్ జయంతి రోజైన ఏప్రిల్ 14ను ‘ప్రపంచ సమానత్వ దినోత్సవం’గా  ప్రకటించాలని ఈ కార్యక్రమంలో పాల్గొన్న పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ చరణ్‌జీత్ సింగ్ అత్వాల్ ఐరాసను కోరారు. ‘బాబా సాహెబ్ జీవితాంతం భారతదేశంతో పాటు ప్రపంచ ప్రజల వివక్షకు వ్యతిరేకంగా, సమానత్వం కోసం పోరాటం చేశారు. అందువల్ల ఆయన జయంతి రోజును ప్రపంచ సమానత్వ దినోత్సవంగా ప్రకటించాలి. ఇదే ఆయనకు నిజమైన నివాళి, గౌరవం’ అని అత్వాల్ ప్రసంగంలో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు