వాలెంటైన్స్ డే.. ఓ లవ్‌ స్కాం!

13 Feb, 2017 16:49 IST|Sakshi
వాలెంటైన్స్ డే.. ఓ లవ్‌ స్కాం!
సిడ్నీ: వాలెంటైన్స్ డే నేపథ్యంలో మూడు దేశాలు అప్రమత్తమయ్యాయి. ఆన్‌లైన్‌లో మోసం చేస్తారు జాగ్రత్త.. అంటూ తమ దేశస్థులను హెచ్చరించాయి. ఒంటరిగా ఉండే వారినే లక్ష్యంగా చేసుకున్న ముఠాల ఆగడాలను అడ్డుకునేందుకు ఆస్ట్రేలియా, మలేసియా, సింగపూర్ దేశాలు ఏకమయ్యాయి. ఈ విధమైన ఆన్‌లైన్‌ దందాతో ఆస్ట్రేలియా వాసులు.. ముఖ్యంగా 40 ఏళ్లు పైబడిన వారు భారీగా జేబులు గుల్ల చేసుకున్నట్లు తేలింది. జీవితాంతం తోడుగా ఉంటామంటూ ప్రేమ కురిపించి డబ్బు లాగేసుకుంటారని ఆస్ట్రేలియా పోలీసులు చెబుతున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఆన్‌లైన్‌లో ప్రేమికులను వెతుక్కునే వారు జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.
 
ఈ తరహా మోసాలకు పాల్పడుతున్న వారిలో నైజీరియన్లే ముందున్నారు. అందుకే ఆన్‌లైన్‌ ప్రేమ వ్యవహారం సాగించేటప్పుడు.. ముందుగా అవతలి వ్యక్తి ఎలాంటి వారో తెలుసుకోవటం ముఖ్యమని  పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు సంబంధించి మూడు దేశాల వారు ఏకమై జరిపిన దాడుల్లో ఈ ముఠాకు చెందిన 27 మందిని అదుపులోకి తీసుకోగా, వారిలో 11 మంది నైజీరియన్లే కావటం గమనార్హం. తమ వలలో చిక్కిన వారితో ఈ మోసగాళ్లు ముఖాముఖి ఫోన్‌లో మాట్లాడటం, నేరుగా కలవటం వంటివి చేయరు. కేవలం మభ్యపెట్టే మెసేజ్‌లతోనే వీరు కథంతా నడుపుతున్నారు. వీరు ఇప్పటి వరకు 108 మందిని మోసగించి సుమారు 5 మిలియన్‌ డాలర్ల మేరకు రాబట్టారని తేలింది. బాధితుల్లో 43 మంది సింగపూర్‌, 65 మంది మలేసియా దేశస్తులు ఉన్నారు.
 
మరిన్ని వార్తలు