సిరీస్‌ చేతికందింది... గెలిపించిన అక్షర్‌ పటేల్‌ 

2 Dec, 2023 00:40 IST|Sakshi

నాలుగో టి20లో 20 పరుగులతో భారత్‌ గెలుపు 

3–1తో సిరీస్‌ వశం 

గెలిపించిన అక్షర్‌ పటేల్‌ 

రేపు ఆఖరి టి20 

సిరీస్‌లోని గత మ్యాచ్‌లతో పోలిస్తే ఈ పోరు భిన్నంగా సాగింది. భారత జట్టు నుంచి చెప్పుకోదగ్గ భారీ షాట్లు లేవు. ఒక్క బ్యాటరూ అర్ధ సెంచరీ చేయలేదు. 200  పరుగులు అవలీలగా చేసిన ఈ సిరీస్‌లో కనీసం ఇక్కడ 180 పరుగులైనా చేయలేకపోయింది. అయినా సరే భారతే మ్యాచ్‌ గెలిచింది. ఆఖరి పోరుకు ముందే సిరీస్‌ను 3–1తో సాధించింది. బ్యాటర్ల అరకొర మెరుపులతో పాటు అక్షర్‌ పటేల్‌ (4–0–16–3) అద్భుతమైన స్పెల్‌ ఆసీస్‌ను ఓడించింది.  

రాయ్‌పూర్‌: సొంతగడ్డపై ఆ్రస్టేలియా చేతిలో వన్డే ప్రపంచకప్‌ను కోల్పోయిన భారత్‌కు కాస్త ఊరట! పొట్టి ఫార్మాట్‌లో టీమిండియా కంగారూపై సిరీస్‌ను కైవసం చేసుకుంది. నాలుగో టి20లో సూర్యకుమార్‌ సేన 20 పరుగుల తేడాతో ఆ్రస్టేలియాపై నెగ్గింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది.

రింకూ సింగ్‌ (29 బంతుల్లో 46; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్‌ (27 బంతుల్లో 37; 6 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. డ్వార్‌షుయిస్‌ 3, బెహ్రెన్‌డార్‌్ఫ, సంఘా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఆసీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 154 పరుగులే చేయగలిగింది. కెప్టెన్‌ మాథ్యూ వేడ్‌ (23 బంతుల్లో 36 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఓపెనర్‌ ట్రవిస్‌ హెడ్‌ (16 బంతుల్లో 31; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుగ్గా ఆడారు.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అక్షర్‌ (3/16) స్పిన్‌తో, దీపక్‌ (2/44) పేస్‌తో దెబ్బ తీశారు. నాలుగో టి20లో భారత్‌ 4 మార్పులతో బరిలోకి దిగింది. తిలక్‌ వర్మ, ఇషాన్‌ కిషన్, ప్రసిధ్‌కృష్ణ, అర్ష్ దీప్‌ స్థానాల్లో శ్రేయస్‌ అయ్యర్, జితేశ్‌ శర్మ, ముకేశ్‌ కుమార్, దీపక్‌ చహర్‌ తుది జట్టులోకి వచ్చారు. ఆస్ట్రేలియా కూడా నాలుగు మార్పులు చేసింది. క్రిస్‌ గ్రీన్, మెక్‌డెర్మాట్, డ్వార్‌షుయిస్, ఫిలిప్‌ తుది జట్టులో ఆడారు.   

రాణించిన రింకూ, జితేశ్‌ 
ఓపెనర్లు యశస్వి, రుతురాజ్‌ (28 బంతుల్లో 32; 3 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించిన తర్వాత తడబడింది. స్వల్ప వ్యవధిలో జైస్వాల్, శ్రేయస్‌ అయ్యర్‌ (8), సూర్యకుమార్‌ (1) అవుటయ్యారు. 13వ ఓవర్లో జట్టు స్కోరు వంద దాటింది. కాసేపటికి రుతురాజ్‌ ఆటను సంఘా ముగించాడు.

ఈ దశలో రింకూ సింగ్, జితేశ్‌ శర్మ (19 బంతుల్లో 35; 1 ఫోర్, 3 సిక్స్‌లు) ధాటితో భారత్‌ ఆ మాత్రం స్కోరు చేసింది. అయితే ధనాధన్‌ బాదాల్సిన డెత్‌ ఓవర్లలో 8 బంతుల వ్యవధిలోనే భారత్‌ 5 వికెట్లను కోల్పోయింది. 19వ ఓవర్లో జితేశ్‌తో పాటు అక్షర్‌ పటేల్‌ (0), ఆఖరి ఓవర్లో రింకూ సింగ్, దీపక్‌ చహర్‌ (0), రవి బిష్ణోయ్‌ (4) అవుటయ్యారు.  

అక్షర్‌ స్పిన్‌ వలలో... 
ఆసీస్‌ లక్ష్య ఛేదనను ధాటిగా ఆరంభించింది. 3 ఓవర్లలోనే చకచకా 40 పరుగులు చేసింది. ఇంతవరకు బాగానే ఉన్నా... నాలుగో ఓవర్‌ నుంచి ఆట రూటు ఒక్కసారిగా మారింది. ఫిలిప్‌ (8)ను స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ పడేయగా... అక్షర్‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో హెడ్‌తో పాటు మెక్‌డెర్మాట్‌ (19), హార్డి (8)లను పడగొట్టడంతో ఆసీస్‌ కష్టాల్లో పడింది. తర్వాత వచ్చిన వారిలో కెప్టెన్‌ వేడ్‌ తప్ప ఇంకెవరూ భారత బౌలింగ్‌ను ఎదుర్కోలేకపోయారు. చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయారు. 

స్కోరు వివరాలు 
భారత్‌ ఇన్నింగ్స్‌: యశస్వి (సి) మెక్‌డెర్మాట్‌ (బి) హార్డి 37; రుతురాజ్‌ (సి) డ్వార్‌షుయిస్‌ (బి) సంఘా 32; అయ్యర్‌ (సి) క్రిస్‌ గ్రీన్‌ (బి) సంఘా 8; సూర్యకుమార్‌ (సి) వేడ్‌ (బి) డ్వార్‌షుయిస్‌ 1; రింకూసింగ్‌ (ఎల్బీ) (బి) బెహ్రెన్‌డార్ఫ్‌ 46; జితేశ్‌ (సి) హెడ్‌ (బి) డ్వార్‌షుయిస్‌ 35; అక్షర్‌ (సి) సంఘా (బి) డ్వార్‌షుయిస్‌ 0; చహర్‌ (సి) క్రిస్‌ గ్రీన్‌ (బి) బెహ్రెన్‌డార్ఫ్‌ 0; బిష్ణోయ్‌ రనౌట్‌ 4; అవేశ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 174. వికెట్ల పతనం: 1–50, 2–62, 3–63, 4–111, 5–167, 6–168, 7–168, 8–169, 9–174.  బౌలింగ్‌: హార్డి 3–1–20–1, బెహ్రెన్‌డార్ఫ్‌ 4–0–32 –2, బెన్‌ డ్వార్‌షుయిస్‌ 4–0–40–3, క్రిస్‌ గ్రీన్‌ 4–0–36–0, తన్వీర్‌ సంఘా 4–0–30–2, మాథ్యూ షార్ట్‌ 1–0–10–0.

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: హెడ్‌ (సి) ముకేశ్‌ (బి) అక్షర్‌ 31; ఫిలిప్‌ (బి) బిష్ణోయ్‌ 8; మెక్‌డెర్మాట్‌ (బి) అక్షర్‌ 19; హార్డి (బి) అక్షర్‌ 8; డేవిడ్‌ (సి) యశస్వి (బి) చహర్‌ 19; షార్ట్‌ (సి) యశస్వి (బి) చహర్‌ 22; వేడ్‌ నాటౌట్‌ 36; డ్వార్‌షుయిస్‌ (బి) అవేశ్‌ 1; క్రిస్‌గ్రీన్‌ నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 154. వికెట్ల పతనం: 1–40, 2–44, 3–52, 4–87, 5–107, 6–126, 7–133. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–44–2, ముకేశ్‌ 4–0–42–0, రవి బిష్ణోయ్‌ 4–0–17–1, అక్షర్‌ పటేల్‌ 4–0–16–3, అవేశ్‌ ఖాన్‌ 4–0–33–1.  

మరిన్ని వార్తలు