అమ్మాయిలు ఉండే స్కూళ్లలో అబ్బాయిలు భేష్‌

11 Nov, 2017 19:45 IST|Sakshi

లండన్ ‌: బాలికలు ఉండే పాఠశాలల్లో బాలురు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి పాఠశాలల్లో ఫలితాలపై సర్వే జరిపిన అధ్యయనకర్తలు ఈ విషయాన్ని తేల్చారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు ఎక్కువ సంఖ‍్యలో ఉండే స్కూళ్లలో ఇద్దరి విద్యా సంబంధ ఫలితాలపై ప్రభావం పడుతోందని.. అయితే, ఈ పరిస్థితుల్లో అబ్బాయిలే ఎక్కువ లాభం పొందుతున్నారని గుర్తించారు. బాలికలు చదువులో చూపించే ఏకాగ్రత, ప్రోత్సాహం వంటివి చూసి బాలురు కూడా చదువులో ముందుండేలా చేస్తున్నాయని తెలిపారు. 

చదివే అలవాటు అబ్బాయిల్లో తక్కువగా ఉండటం సర‍్వసాధారణమే అయినప్పటికీ అంతిమంగా అది వారి చదువుపై ప్రభావం చూపుతోందని తేల్చారు. ఇలాంటి పరిస్థితి బాలురు ఎక్కువగా ఉండే పాఠశాలల్లో కనిపిస్తోందని గుర్తించామని నెదర్లాండ్స్‌లోని ఉట్రెక్టు వర్సిటీ పరిశోధకురాలు మార్‌గ్రియట్‌ వాన్‌ హెక్‌ తెలిపారు. బాలురు, బాలికల నిష్పత్తిని సమానంగా ఉంచటం ద్వారా పాఠశాలలు మెరుగైన ఫలితాలను సాధించటంలో తోడ్పడుతున్నాయని చెప్పారు. 

దాదాపు 15 ఏళ్లపాటు రెండు లక్షల మంది విద్యార్థులను పరిశీలించామని చెప్పారు. బాలుర కంటే బాలికలు 60 శాతం ఎక్కువగా ఉన్న బడులలో బాలురు చదువులో మెరుగ్గా ఉంటున్నట్లు ఇందులో తేలిందని ఆమె చెప్పారు. ఇలాంటి చోట్ల బాలల్లో నేర్చుకునే తత్వం కూడా పెరుగుతోందని గుర్తించామన్నారు. 

బాలుర పాఠశాలలు, వృత్తివిద్యా సంస్థల వంటి చోట్ల బాలురు మెరుగైన ఫలితాలను సాధించలేకపోతున్నట్లు తేలిందన్నారు. స్కూల్‌ ఎఫెక్టివ్‌నెస్‌ అండ్‌ స్కూల్‌ ఇంప్రూవ్‌మెంట్‌ జర్నల్‌లో ఇటీవల ఈ అధ్యయన ఫలితాలు ప్రచురితమయ్యాయి.
 

మరిన్ని వార్తలు