బీరు బాబులకు ఇబ్బందే!

17 Oct, 2018 01:31 IST|Sakshi

లండన్‌: ప్రపంచవ్యాప్తంగా అత్యధికులు ఇష్టపడే బీరుపైనా వాతావరణ మార్పులు ప్రభావం చూపనున్నాయి. భవిష్యత్తులో బీరు ఉత్పత్తి తగ్గి, ధరలు పెరిగే అవకాశం ఉందని బ్రిటన్‌లోని ఈస్ట్‌ ఆంగ్లియా వర్సిటీ పరిశోధకులు గుర్తించారు. దీంతో బీర్ల వినియోగమూ తగ్గనుంది. బీర్ల తయారీకి ప్రధానంగా బార్లీని వాడతారు. ప్రపంచవ్యాప్తంగా పండే బార్లీలో ప్రస్తుతం 17 శాతం బీరు తయారీకే వాడుతున్నారు. ఏటా తీవ్రమవుతున్న కరువు పరిస్థితులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా బార్లీ దిగుబడులు పడిపోతున్నాయి.

బార్లీ ఉత్పత్తిపై వాతావరణ మార్పుల ప్రతికూల ప్రభావం ఆయా దేశాల పరిస్థితులను బట్టి 3 నుంచి 17 శాతం వరకు పడనుంది. దీనివల్ల బీరు తయారీలో వాడే బార్లీ పరిమాణం తగ్గిపోనుంది. అంతిమంగా ఉత్పత్తి పడిపోయి, డిమాండ్‌ కారణంగా బీర్ల ధరలు ఆకాశాన్నంటుతాయని పరిశోధకులు అంటున్నారు. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా బీరు వినియోగం కూడా 16 శాతం లేదా 2,900 కోట్ల లీటర్లకు పడిపోతుందని పేర్కొన్నారు. ఇది ఏటా అమెరికన్లు తాగే బీరుకు సమానం.

>
మరిన్ని వార్తలు