గోధుమ పిండి.. మైదాపిండి.. కాఫీ కాయ పిండి!

22 Apr, 2014 04:28 IST|Sakshi

కాఫీ గింజల పొడి తెలుసు. కానీ, ఈ కాఫీ కాయ పిండి ఏంటీ... అని అనుకుంటున్నారా? కమ్మటి కాఫీ గింజలను ఇచ్చేవే కాఫీ కాయలు. ఇంతకాలం వృథాగా పారబోస్తున్న ఈ కాయలనే... ఆరోగ్యకరమైన పిండిగా మార్చే పద్ధతిని సియాటెల్‌కు చెందిన సీఎఫ్ గ్లోబల్ హోల్డింగ్స్ సంస్థ ఆవిష్కరించింది. ఈ పిండి అత్యంత పౌష్టికాహారంగా ఉపయోగపడుతుందని, అదే సమయంలో కాఫీ తోటల యజమానులకు అదనపు ఆదాయాన్ని అందిస్తుందని సీఎఫ్ గ్లోబల్ వ్యవస్థాపకులు డాన్, కెన్‌పోప్ అంటున్నారు. ‘‘ముడి గోధుమ పిండి కంటేఅయిదు రెట్లు ఎక్కువ ఫైబర్, కాఫీ కాయ పిండిలో ఉంటుంది. అదే సమయంలో కొవ్వులు చాలా తక్కువగా ఉంటాయి.
 
 పాలకూర కంటే మూడు రెట్లు ఎక్కువగా ఇనుము, అరటిపండ్ల కంటే రెండు రెట్లు ఎక్కువ పొటాషియం, కేల్ (ఒక రకమైన ఆకుకూర) కంటే మూడు రెట్లు ఎక్కువ ప్రొటీన్లు కాఫీ కాయ పిండిలో ఉంటాయి’’ అని వివరించారు డాన్. గోధుమ పిండి మాదిరిగా దీంతో బ్రెడ్ చేసుకోవచ్చు. పాస్తాలు, జీడిపప్పు, బాదం పప్పులతో కలిపి తీపి తినుబండారాలూ తయారు చేసుకోవచ్చు. సీఎఫ్ గ్లోబల్ ఇప్పటికే హవాయి, నికరాగ్వా, గ్వాటెమాలాతోపాటు, మెక్సికో, వియత్నాంలో కాఫీ కాయ పిండిని తయారు చేసి అమ్ముతోంది. త్వరలో భారత్‌లోనూ ప్రవేశిస్తామని కంపెనీ చెబుతోంది. అయితే, ఇంతకీ దీని రుచి కూడా కాఫీ మాదిరిగానే ఉంటుందని అనుకుంటున్నారా? కాదు. కొంచెం పుల్లగా ఉంటుందట.

మరిన్ని వార్తలు