తమ్ముళ్ల సహకారం | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల సహకారం

Published Tue, Apr 22 2014 4:24 AM

Younger co-operation

  •     తట్టుకోలేకపోతున్న బీజేపీ
  •      మోడీపైనే భారం
  •      నేటి సభపై గంపెడాశలు పెట్టుకున్న కాషాయ సేన
  •      ‘గ్రేటర్’లో నామ్‌కేవాస్తే గా మారిన టీడీపీ, బీజేపీ పొత్తు
  •  సాక్షి, సిటీబ్యూరో: భిన్న వర్గాలు.. విభిన్న కలయికలు.. సరికొత్త సమీకరణాలు.. లోపాయికారీ ఒప్పందాలకు నెలవైన నగరంలో టీడీపీతో పొత్తు వల్ల చిత్తవుతామనే ఆందోళన బీజేపీ నేతలను తొలుస్తోంది. ఈ పరిస్థితిలో తమను గట్టెక్కించే తారకమంత్రం మోడీయేనని బీజేపీ భావిస్తోంది. అందుకే మంగళవారం నగరంలో జరగనున్న మోడీ సభపై గంపెడాశలు పెట్టుకుంది.

    ‘గ్రేటర్’లో టీడీపీ- బీజేపీ పొత్తు నామ్‌కేవాస్తేగా మారింది. టీడీపీ, బీజేపీలు తమ పార్టీ శ్రేణుల మనోభావాలతో కానీ.. కనీసం ద్వితీయశ్రేణి నాయకత్వం అభిప్రాయాలతో గాని పని లేకుండా కేవలం అధిష్ఠానాల మనోభీష్టాలకు అనుగుణంగా కుదుర్చుకున్న పొత్తు ‘ఇష్టం లేని కాపురం’లా సాగుతోంది. గ్రేటర్‌లో తాము ఆశలు పెట్టుకున్న స్థానాలను పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారనే నిర్వేదంలో ఉన్న టీడీపీ నాయకులు.. వారి అనుచరులు బీజేపీ అభ్యర్థులకు సహకరించడం లేదు.

    ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులు తమకు టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ ఒంటరి పోరాటాన్నే చేయాల్సి వస్తోంది. దీనికంటే ఒంటరిగా పోటీ చేస్తేనే తాము ఎక్కువ స్థానాలను గెలుచుకోగలిగేవారమని బీజేపీ శ్రేణులు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నాయి. పొత్తులో భాగంగా తమకు  కేటాయించిన స్థానాల్లో టీడీపీ సహాయ నిరాకరణ ఆ పార్టీకి కొత్త తలనొప్పిగా మా రింది. కాబోయే ప్రధాని మోడీయేనన్న నినాదమే తమనిప్పుడు ఆదుకోగల మం త్రంగా బీజేపీ భావిస్తోంది.

    ఇప్పటి వరకు టీడీపీ నుంచి తగిన సహకారం లభించకపోవడంతో దాని వల్ల నష్టమే తప్ప లాభం లేదనే అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో  రెండు పార్టీల నడుమ నేటికీ కొనసాగుతున్న అంతరాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. పొత్తులో భాగంగా రెండు పార్టీల వారు అభ్యర్థుల విజయానికి కలిసి పనిచేయాలని రెండు పార్టీల అగ్రనేతలు అభిలషించినప్పటికీ అది అమలుకు నోచుకోలేదు. రెండు పార్టీల జిల్లాల అధ్యక్షులు ఇందుకోసం ఇంతవరకు చేసిందేమీ లేదు. వారిద్దరూ కూడా పోటీలో ఉండటంతో తమ ప్రచారం, తామ నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారు.

    ఈ నేపథ్యంలో రెండు పార్టీలూ మీదో దారి.. మాదో దారి అన్నట్లుగానే వ్యవహరిస్తున్నాయి. అంతిమంగా ఇది ఇతర పార్టీలకు ప్రయోజనకరంగా మారే పరిస్థితి ఏర్పడింది. తెలుగు తమ్ముళ్లు బీజేపీకి సహకరించని నేపథ్యంలో.. పొత్తు కాస్తా కొత్త విపత్తుగా మారే ప్రమాదం పొంచి ఉందని భావిస్తున్న బీజేపీ .. టీడీపీని నమ్మే పరిస్థితి లేదు. త్వరలోనే పోలింగ్ ఏజెంట్లను నియమించాల్సి ఉండటంతో ఎందుకైనా మంచిదనే తలంపుతో ఉన్న బీజేపీ శ్రేణులు పోలింగ్ ఏజెంట్లుగా టీడీపీ క్యాడర్‌ను నియమించేందుకు ససేమిరా అంటున్నట్లు సమాచారం. పొత్తులో భాగంగా రెండు పార్టీలకు చెందిన వారిని పోలింగ్ ఏజెంట్లుగా నియమించుకోవాలనే యోచన ఉన్నప్పటికీ.. ఇప్పటిదాకా టీడీపీ ఇచ్చిన సహకారాన్ని చూసిన బీజేపీ.. పోలింగ్ ఏజెంట్లుగా మాత్రం మీవాళ్లు వద్దని చెప్పడం రెండుపార్టీల ‘సహకారాన్ని’ చాటుతోంది.

     సర్వత్రా సహాయ నిరాకరణే

    అంబర్‌పేట అసెంబ్లీ నియోజకవర్గం సీటును బీజేపీకి కేటాయించడంతో అక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరచిన  టీడీపీ నాయకుడు సి. కృష్ణయాదవ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో టీడీపీ నేతలు ఆయన్ని బుజ్జగించి నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించారు. ఆయన ఇన్‌చార్జిగా రెండుపార్టీల నాయకుల సమన్వయంతో బీజేపీ అభ్యర్థి విజయానికి కృషి చేయాల్సి ఉండగా.. అక్కడ అది సాగడం లేదు. టీడీపీ  జిల్లా ప్రధాన కార్యదర్శి వనం రమేశ్, కృష్ణయాదవ్‌లకే పొసగడం లేదు. వారిద్దరి మధ్య సఖ్యత కుదిర్చేందుకే ఇతర నాయకులు పాటు పడాల్సి వస్తోంది. ఒకే పార్టీలోని వారి మధ్యే విభేదాలుండటంతో, మిత్రపక్ష అభ్యర్థికి వారి వల్ల లాభం జరిగే పరిస్థితి కనిపించడం లేదు.
         
    ఉప్పల్ టికెట్‌ను బీజేపీకి కేటాయించడంతో టీడీపీ శ్రేణులు సహకరించడం లేదు. ఉప్పల్ అసెంబ్లీ టికెట్‌పై ఆశలు పెట్టుకొని క్షేత్రస్థాయిలో బలగం పెంచుకున్న వీరేందర్‌గౌడ్‌కు చేవెళ్ల లోక్‌సభ టికెట్ ఇవ్వడంతో టీడీపీ క్యాడర్ ఇక్కడ పనిచేయడం లేదు.
         
    మలక్‌పేటలో బీజేపీ అభ్యర్థికి టీడీపీ క్యాడర్ సహకరించడం లేదనే ఆరోపణలుండగా.. బీజేపీయే తమను వినియోగించుకోవడం లేదని అభ్యర్థి ప్రచారానికి పిలవడం లేదని టీడీపీ క్యాడర్ ప్రత్యారోపణలు చేస్తోంది.
         
    ఖైరతాబాద్‌లో టీడీపీ ఇన్‌చార్జి కె. విజయరామారావు బీజేపీ అభ్యర్థికి సహకరించాల్సిందిగా చెబుతున్నా పార్టీ క్యాడర్ ఆయన మాటలు పట్టించుకోవడం లేదని సమాచారం.
         
    మల్కాజిగిరి అసెంబ్లీ టి కెట్ తమ పార్టీకి దక్కకపోవడంతో టీడీపీ శ్రేణులన్నీ టీఆర్‌ఎస్ వైపు వెళ్లాయి. ముషీరాబాద్, గోషామహల్‌లలోనూ ఇదే పరిస్థితి.
     

Advertisement

తప్పక చదవండి

Advertisement