డెత్‌ నోటీసుల కోసం పేపర్‌ పేజీలు పెంచారు

15 Mar, 2020 20:05 IST|Sakshi

రోమ్‌ : చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్‌ ప్రస్తుతం ఇతర దేశాల్లో విజృంభిస్తోంది. ముఖ్యంగా ఇటలీ, ఇరాన్‌లలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. కరోనా బారిన పడి మృతిచెందే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇటలీలో కరోనా మృతుల సంఖ్య 1400కు పైగా ఉండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. తాజాగా ఇటలీలో కరోనా తీవ్రత ఎలా ఉందో తెలిపే ఓ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇటలీలోని ఓ స్థానిక పత్రికలో డేత్‌ నోటీసులు ప్రచురించడానికి మాములుగా ఒక పేజీని కేటాయిస్తారు. అయితే కరోనా మృతుల నేపథ్యంలో దానిని పది పేజీలకు పెంచేశారు. 

వివరాల్లోకి వెళితే.. ఇటలీలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న లోంబార్డిలో పబ్లిష్‌ అయ్యే ‘లి ఎకో డి బెర్గామో’  అనే స్థానిక పత్రికలో ఫిబ్రవరి 9వ తేదీన ఒక పేజీన్నర భాగంలో డెత్‌ నోటీసులను ప్రచురించారు. ఆ సమయంలో ఇటలీలో కేవలం ముగ్గురికి కరోనా సోకినట్టు మాత్రమే నిర్ధారణ అయింది. మార్చి 13న అదే పేపర్‌లో డేత్‌ నోటీసులను ప్రచురించడానికి పది పేజీలను కేటాయించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అంతేకాకుండా ఇటలీలో కరోనా ఏ విధంగా మృత్యు ఘంటికలు మోగిస్తుందో ప్రపంచానికి చాటిచెప్పారు. కాగా, మార్చి 13 వరకు ఇటలీలో 17,600 మందికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. అందులో 1,266 మంది మృతిచెందారు. 

మరోవైపు ఇటలీలో కరోనా బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఐసీయూలో బెడ్స్‌ సరిపోవడం లేదు. ఈ క్రమంలో ఒకవేళ హాస్పిటల్స్‌లో బెడ్స్‌ కొరత ఉంటే 80 ఏళ్లు పైబడినవారికి, ఆరోగ్యం పూర్తిగా క్షీణించినవారికి ఐసీయూలోకి ప్రవేశం నిరాకరించాలని సలహా ఇస్తూ టురిన్‌లోని విపత్తు నిర్వహణ బృందం నిర్ణయం తీసుకుంది. బాధితులకు సరిపడ బెడ్స్‌ లేనప్పుడు ఎవరిని ఐసీయూలో ఉంచి చికిత్స అందించాలనే దానిపై కూడా ఓ ప్రణాళికను తయారుచేసింది. 

>
మరిన్ని వార్తలు