ఫ్రాన్స్‌లో కాకులకు ‘చెత్త’ పని!

14 Aug, 2018 05:09 IST|Sakshi

కుండలో అడుగులో ఉన్న నీళ్లను రాళ్లు వేసి నీళ్లు పైకొచ్చాక  దాహం తీర్చుకున్న తెలివిగల కాకి కథ.. గుర్తుంది కదా! ఈసారి వెరైటీగా కాకులు చెత్త ఏరివేతకు సిద్ధయయ్యాయి. ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత థీమ్‌ పార్కు పుయ్‌ డు ఫౌలో ఆరు కాకుల ముక్కులకు బృహత్తర పని అప్పజెప్పారు. వాటి పనల్లా నేలపై పడిన సిగరెట్‌ ముక్కలు, ఇతర చెత్తా చెదారాన్ని తీసుకెళ్లి చెత్తబుట్లలో వేయడమే. కాకపోతే ట్రైనింగ్‌ ఇచ్చారు లెండి. ‘పార్కును శుభ్రంగా ఉంచాలన్నది ఒకటే మా లక్ష్యం కాదు.. పర్యావరణం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్వయంగా ప్రకృతి మనకు నేర్పుతుందనే విషయాన్ని చాటి చెప్పడం కూడా తమ ఉద్దేశ’మని పార్కు ఉన్నతాధికారి నికోలస్‌ డి విల్లీయర్‌ అంటున్నారు.

కాకులు తమ తెలివితేటలను ప్రదర్శించడం ఇదే మొదటిసారి కాదు. కాకులకు సమస్యను పరిష్కరించే సత్తా ఉందని ఈ ఏడాది ప్రారంభంలో తయారు చేసిన ఒక వెండింగ్‌ మెషీన్‌ ద్వారా శాస్త్రజ్ఞులు నిరూపించారు. ఒక ప్రత్యేక సైజ్‌ కాగితం ముక్కను యంత్రంలో వేస్తేనే యంత్రంలో ఉంచిన ఆహారం బయటికి వస్తుంది. కాకులు ఈ ఫీట్‌ను దిగ్విజయంగా పూర్తి చేశాయి. యంత్రంలో ఏ సైజ్‌ కాగితపు ముక్కలను వేయాలనేది గుర్తుంచుకుని.. ఆ మేరకు పెద్ద సైజ్‌ కాగితాన్ని సైతం చిన్న ముక్కలుగా చేసి యంత్రంతో వేయడాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు.  ఏదేశమైనా ఎక్కడైనా.. నీకు హేట్సాఫ్‌ కాకీజీ!
 

మరిన్ని వార్తలు