భగ్గుమంటున్న అగ్రరాజ్యం

1 Jun, 2020 03:56 IST|Sakshi
ఫిలడెల్పియాలో కారును ధ్వంసం చేస్తున్న నిరసనకారులు.

జార్జి ఫ్లాయిడ్‌ మృతిపై అమెరికాలో ఆగని జనాగ్రహం

12 నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ

వాషింగ్టన్‌/మినియాపొలిస్‌: మినియాపొలిస్‌లో రాజుకున్న అశాంతి అగ్గి అమెరికాలోని ఇతర నగరాలకూ వ్యాపిస్తోంది. జార్జి ఫ్లాయిడ్‌ అనే ఆఫ్రికన్‌అమెరికన్‌ను శ్వేత జాతి పోలీసు అధికారులు పొట్టనబెట్టుకోవడంపై ఆగ్రహం పెల్లుబికింది. పోలీసులతో ఆందోళనకారులు బాహాబాహీకి దిగడంతో పాటు షాప్‌లు, ఆఫీస్‌లు, వాహనాలకు నిప్పుపెట్టారు. ఫ్లాయిడ్‌ మృతికి నిరసనగా వాషింగ్టన్‌లో ఆదివారం శాంతియుతంగా ప్రదర్శన జరిగింది. ఆందోళనకారులు అధ్యక్ష భవనం సమీపంలో చెత్త కుప్పకు నిప్పుపెట్టారు.

న్యూయార్క్‌లో ఓ యువతి అరెస్ట్‌ దృశ్యం

ఆందోళనలకు కేంద్ర బిందువైన మినియాపొలిస్‌లో పోలీస్‌స్టేషన్‌ను చుట్టుముట్టిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్‌ గ్యాస్, రబ్బర్‌ బుల్లెట్లను ప్రయోగించారు. నగరంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం 4 వేల నేషనల్‌ గార్డులను రంగంలోకి దించింది. ఇండియానాపొలిస్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు చనిపోయారు. రెండు రోజుల క్రితం డెట్రాయిట్, మినియాపొలిస్‌ల్లో జరిగిన ఘటనల్లోనూ ఇద్దరు మరణించారు. ఫిలడెల్ఫియాలో ఆందోళనకారుల దాడిలో 13 మంది పోలీసులు గాయపడగా నాలుగు పోలీసు వాహనాలు కాలిబూడిదయ్యాయి. న్యూయార్క్‌లో వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు యత్నించడం కొట్లాటలకు దారి తీసింది. గురువారం నుంచి ఇప్పటి వరకు 22 నగరాల్లో 1,669 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఇందులో సగం అరెస్టులు లాస్‌ఏంజెలిస్‌లోనే జరిగాయి. లాస్‌ఏంజెలిస్‌ నగరంలో నిరసన కారులు భవనాలు, వాహనాలకు నిప్పుపెడుతుండటంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అట్లాంటా, డెన్వెర్, లాస్‌ఏంజెలిస్, మినియాపొలిస్, శాన్‌ ఫ్రాన్సిస్కో, సియాటెల్‌ సహా 12కు పైగా నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ
విధించారు.

నా రెస్టారెంట్‌ కాలిపోయినా సరే..
మినియాపొలిస్‌ నిరసనలకు బంగ్లాదేశీయుడు, స్థానిక ‘గాంధీ మహల్‌ రెస్టారెంట్‌’ యజమాని రుహేల్‌ ఇస్లాం(44) మద్దతుగా నిలిచారు. మినియాపొలిస్‌ పోలీస్‌ ఆఫీస్‌ దగ్గర్లో ఇతన రెస్టారెంట్‌ ఉంది. ఆ రెస్టారెంట్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఆ రోజు జరిగిన ఘటనపై రుహేల్‌ కుమార్తె హఫ్సా (18) ఫేస్‌బుక్‌లో పెట్టిన పోస్టు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ‘ఆ రోజు నాన్న పక్కనే కూర్చుని టీవీలో వార్తలు చూస్తున్నా. నాన్న ఎవరితోనో ఫోన్‌లో.. నా బిల్డింగ్‌ను తగలబడనివ్వండి. బాధితులకు మాత్రం న్యాయం దక్కాలి. బాధ్యులను జైల్లో పెట్టాలి..అని అంటుండగా విన్నాను. మాకు నష్టం జరిగినా సరే, పొరుగు వారికి సాయంగా, బాసటగా నిలవాలన్న మా సంకల్పం ఏమాత్రం సడలదు’ అని అందులో హఫ్సా పేర్కొంది.

మరిన్ని వార్తలు