జీ7 వేదికగా అమెరికాకు అవమానం!

26 Aug, 2019 14:20 IST|Sakshi

పారిస్‌: ఫ్రాన్స్‌లో జరుగుతున్న జీ7 దేశాల సదస్సులో అగ్రరాజ్యం అమెరికాకు అవమానం జరిగింది. ఈ సమావేశం నిర్వహించే బియారిట్జ్‌ నగరంలోనే ఇరాన్‌ విదేశాంగ మంత్రి మహ్మద్‌ జావేద్‌ జరీఫ్‌ ప్రత్యక్షమయ్యారు. ఆయనతో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఎమ్మానుయేల్‌ మెక్రాన్‌ రహస్య సమావేశం నిర్వహించారు. దీనిపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‘నో కామెంట్‌’​ అని ఈ అంశాన్ని తేలిక పర్చడానికి ప్రయత్నించినా అమెరికా అధి​కారులు మాత్రం రగులుతూనే ఉన్నారు. ఇరాన్‌పై ఆంక్షలు విధిస్తూ, ఇతర దేశాలు ఇరాన్‌తో ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోరాదని ఒత్తిడి తెస్తున్న సందర్భంలో ఒక మిత్రదేశం ఇరాన్‌తో చర్చలు జరపడం, అది కూడా జీ7 వేదిక నగరంలోనే కావడం అమెరికాకు నిజంగా మింగుడుపడని అంశం.

ఈ చర్చలపై ఇరాన్‌ మంత్రి మాట్లాడుతూ ‘దారి కష్టంగానే ఉన్నా విలువైన ప్రయత్నం చేస్తున్నాం. ఈ సందర్భంగా బ్రిటన్‌, జర్మనీ ప్రతినిధులతో కూడా సమావేశం జరిపాం’ అని తెలిపారు. తాజా వ్యవహారంతో ఇరాన్‌​ విషయంలో అమెరికా రోజురోజుకూ ఒంటరి అవుతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఇరాన్‌తో 2015లో కుదుర్చుకున్న ఒప్పందం నుంచి అమెరికా బయటకు వచ్చినా ఒప్పందంలోని మిగతా దేశాలు ముఖ్యంగా యూరప్‌ దేశాలు ఇరాన్‌తో ఒప్పందాన్ని నామమాత్రంగా అయినా కొనసాగిస్తున్నాయి. గత కొంతకాలంగా పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పటి నుంచి ఇరాన్‌ విషయంలో అమెరికా తీవ్రంగా స్పందిస్తోంది. ఇప్పుడు ఫ్రాన్స్‌ చర్యలపై కూడా అమెరికా అధికారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరాన్‌తో ఒప్పందం చేసుకోవాలని, తాను మధ్యవర్తిత్వం వహిస్తానని మెక్రాన్‌ కొంతకాలంగా అమెరికాపై తీవ్ర ఒత్తిడి చెస్తున్నారని తెలిపారు.​ ఇతర దేశాలతో కలసి ఇరాన్‌తో ఒప్పందం కుదరదని, ఇరాన్‌ విషయంలో సొంత దృక్పథంతోనే ముందుకు వెళ్తామని తమ అధ్యక్షుడు ట్రంప్‌ స్పష్టం చేశారన్నారు.

అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌పాంపియో మాట్లాడుతూ ఇరాన్‌ మంత్రి అమెరికా వ్యతిరేక ఎజెండాను వ్యాప్తి చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. మాజీ యూఎన్‌ అంబాసిడర్‌ నిక్కీ హేలీ మాట్లాడుతూ ‘ఇది పూర్తిగా అమెరికాను అగౌరవ పర్చే చర్య’ అని వాపోయారు. ఈ విమర్శలపై ఇరాన్‌ మంత్రి జరీఫ్‌ మాట్లాడుతూ.. ‘అమెరికా ఎప్పటిలాగే ప్రవర్తించింది. నేను ఒక దేశానికి ప్రతినిధిని, వారికి బాధ కలిగించే వాస్తవం ఏంటంటే వారు నన్ను, నా కుటుంబాన్ని, నా ఆస్తులను ఏం చేయలేరు, ఎందుకంటే అవి ఏవీ ఇరాన్‌ను దాటి బయట లేవు’ అని చురకలంటించారు. నన్ను చూసి భయపడుతున్నందుకు క్షమాపణలు చెబుతున్నానని కూడా వ్యాఖ్యానించారు. ఈ తాజా ఘటనపై ఓ విశ్లేషకుడు.. ‘ఒక అంతర్జాతీయ వేదిక మీద ఒక అగ్రరాజ్యానికి అవమానమా? వినడానికి ఎంత బాగుందో కదా అని ట్విటర్‌ వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ కనీసం కొందరు అంతర్జాతీయ నాయకులకు అయినా ఇరాన్‌తో చర్చలపై సమాచారం ఇవ్వాల్సిందని కొందరు అభిప్రాయపడ్డారు.

జీ-7 
మూడు రోజుల(శని, ఆది, సోమ) పాటు బియారిట్జ్‌లో జరిగే సదస్సులో  జీ7 దేశాల అధినేతలు, ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాధినేతలు పాల్గొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రధాని మోదీతో సహా పలువురు నేతలు ఆదివారమే ఫ్రాన్స్‌కు బయల్దేరారు. వాతావరణ మార్పులు, పర్యావరణం, డిజిటల్‌ సేవలు అనే అంశాలపై మోదీ ప్రసంగించనున్నారు. అమెరికా- చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, బ్రెగ్జిట్‌, అమెజాన్‌ అడవిలో కార్చిచ్చు మొదలైనవి సదస్సులో ప్రధానాంశాలుగా ఉంటాయని తెలుస్తోంది. (చదవండి: కశ్మీర్‌పై మధ్యవర్తిత్వానికి రెడీ)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా