అంచనాలు నిజమైతే ట్రంప్‌దే విజయం

4 Nov, 2016 17:18 IST|Sakshi
అంచనాలు నిజమైతే ట్రంప్‌దే విజయం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ బలం పుంజుకుంటున్నారు. తొలుత డెమోక్రట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌ కన్నా ఎంతో వెనకబడిన ట్రంపు క్రమంగా తన విజయావకాశాలను మెరగుపర్చుకుంటూ ముందుకు దూసుకెళుతున్నారు. తాజా సర్వేలో హిల్లరీ క్లింటన్‌కన్నా కొద్దిగా ట్రంపు ముందే ఉన్నారని కూడా తేలింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య పోటీ తీవ్రంగా ఉంటుందని అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బరాక్‌ ఒబామా కూడా అంగీకరించారు. దేశాధ్యక్ష ఎన్నికల్లో అవసరమైన 270 ఎలక్టోరల్‌ ఓట్లను సాధించి విజయతీరాలను చేరుకోవాలంటే ట్రంప్‌కు మరీ కష్టమేమీ కాదు. అంచనాల ప్రకారం అనుకూల అంశాలు కలిసొస్తే ఆయన విజయాన్ని దక్కించుకోవచ్చు.

కొలరాడో, ఫ్లోరిడా, ఐహోవా, మైనె, మిచిగాన్, న్యూమెక్సికో, నార్త్‌ కరోలినా ఒహాయో, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, వర్జీనియా, నేవడ, న్యూహాంప్‌షైర్‌ రాష్ట్రోల్లో ఎలక్టోరల్‌ ఓటర్లను ప్రభావితం చేసేందుకు ఆయన తుదిదశ ప్రచారం కింద రెండున్నర కోట్ల డాలర్ల టీవీ యాడ్స్‌ను ప్రసారం చేస్తున్నారు. రిపబ్లికన్ల కంచుకోటలైన ఆరిజోనా, జార్జియా, ఉటావా, టెక్సాస్‌ లాంటి రాష్ట్రాలపైనున్న పూర్తి అంచనాలతోనే ఆయన మిగతా రాష్ట్రాల్లోనే ప్రచారం కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. ఆశించిన ఫలితాలు రావాలంటే ఫ్లోరిడా, ఒహాయో, నార్త్‌ కరోలినా, ఐహోవా రాష్ట్రాలను తప్పినిసరిగా ట్రంప్‌ గెలుచుకోవాలి. వీటితో పాటు రెండవ పార్లమెంట్‌ సీటైన మైనేను గెలుచుకున్నట్లయితే ట్రంప్‌కు 260 ఎలక్టోరల్‌ ఓట్లు వస్తాయి.

పెద్ద రాష్ట్రాలైన పెన్సిల్వేనియా, విస్కాన్సిన్, వర్జీనియా, మిచిగాన్‌లో కచ్చితంగా ఒక రాష్ట్రాన్ని ట్రంప్‌ గెలుచుకోవాలి. చిన్న రాష్ట్రాలైన నేవడ, న్యూహాంప్‌షైర్, న్యూమెక్సికో రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాలను గెలుచుకోవాలి. 2012 ఎన్నికల్లో మిట్‌రోమ్నీ గెలుచుకున్న అన్ని రిపబ్లికన్ల ఆధిపత్య రాష్ట్రాలను గెలుచుకోవడమే కాకుండా బరాక్‌ ఒబామాను బలపర్చిన ఫ్లోరిడా, ఒహాయో, నేవడ, న్యూహాంప్‌షైర్‌ రాష్ట్రాల ఓట్లను తనవైపు తిప్పుకున్నట్లయితే ట్రంప్‌కు విజయానికి కావాల్సిన 270 ఎలక్టోరల్‌ ఓట్లు వస్తాయి. అప్పుడు హిల్లరీ క్లింటన్‌ 268 ఓట్లతో ఓడిపోతారు.

హిల్లరీ క్లింటన్‌ మద్దతున్న విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ట్రంప్‌ పాగా వేయగలిగితే ఇక ఆయన విజయానికి ఢోకా ఉండదు. అప్పుడు ఆయనకు 290 వరకు ఓట్లు వస్తాయి. ఉత్తర కరోలినా, ఫ్లోరిడా, జార్జియా రాష్ట్రాల్లోని నల్లజాతీయ ఓటర్లు సహజంగా డెమోక్రట్లకు ఇంతకాలం ఓటు వేస్తూ వస్తున్నారు. ఈసారి వారికి డెమోక్రట్‌ ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంది. ఆ కారణంగా వారు ట్రంప్‌కు ఓటేస్తే, వారి బాటలోనే నల్లజాతీయులు ఎక్కువగావున్న మిచిగాన్‌ రాష్ట్రం కూడా ట్రంప్‌వైపు తిరిగితే ఆయన విజయం మరింత సులువు.

మరిన్ని వార్తలు