చైనా తీరుపై డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహం

30 Jul, 2017 15:22 IST|Sakshi
చైనా తీరుపై డోనాల్డ్ ట్రంప్ ఆగ్రహం

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్ ఆందోళన రోజురోజుకు పెరిగిపోతోంది. ఓ వైపు తమ దేశ అవతరణ వేడుకలు జరుపుకుంటుండగా ఉత్తర కొరియా అదేరోజు (జూలై 4న) ఖండాంతర క్షిపణిని ప్రయోగించడాన్ని నేటికీ ట్రంప్ జీర్ణించుకోలేక పోతున్నారు. అమెరికాలోని అలస్కాకు సులువుగా క్షిపణులు ప్రయోగించే దిశగా నార్త్ కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ పావులు కదుపుతున్నారని అమెరికా నిఘా వర్గాలు హెచ్చరించిన అనంతరం ట్రంప్ రంగంలోకి దిగారు. ఈ విషయంలో తమకు చైనా పూర్తిస్థాయిలో సహాయం చేస్తుందని భావించారు.

నార్త్ కొరియా వల్ల ప్రపంచానికే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించినా చైనా వైఖరిలో మార్పు రాలేదని శనివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా వ్యాఖ్యానించారు. తమ సూచనల మేరకు దక్షిణ కొరియా వ్యాపార పరమైన విషయాలలో ఉత్తర కొరియాకు ఎన్నో ఆంక్షలు విధిస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. అయితే పటిష్టమైన ఆసియా దేశం చైనా మాత్రం తమ మాట పెడచెవిన పెట్టిందంటూ అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా గత పాలకులు మూర్ఖులని, అందుచేతనే ఏడాదికి వందల బిలియన్ల డాలర్ల వర్తకాలు చేశారని మండిపడ్డారు. నార్త్ కొరియా ఆట కట్టించేందుకు సైనిక చర్యనే తుది నిర్ణయంగా మారవచ్చునని దక్షిణకొరియా, అమెరికా ఆర్మీ భావిస్తున్నట్లు తెలిపారు.

తమకు సహకరించేందుకు సిద్ధమైన సౌత్ కొరియా గత శుక్రవారం రక్షణశాఖమంత్రి సాంగ్ యంగ్ మూ ఆధ‍్వర్యంలో క్షిపణిని పరీక్షించినట్లు వెల్లడించారు. మరోవైపు చైనా పాలసీల కారణంగా అమెరికా 309 బిలియన్ డాలర్లు నష్టపోయిందన్నారు. కిమ్ జోంగ్ పై పోరాటం చేసేందుకు బదులుగా చైనా మాత్రం.. అమెరికా టెక్నాలజీ సర్వీసులను తప్పుబట్టడం సబబు కాదని డోనాల్డ్ ట్రంప్ అన్నారు. రష్యా, చైనాల సాయంతో నార్త్ కొరియా నియంతను అడ్డుకోవాలని లేనిపక్షంలో ముందుగా అమెరికాకే తీవ్ర నష్టం వాటిల్లుతుందని పెంటగాన్ హెచ్చరించింది. ఎంతో నమ్మకం ఉంచి సాయం కోరినా చైనా ఆ దిశగా అడుగులు వేయడం లేదని ట్రంప్ ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని వార్తలు