ప్యారిస్‌ ఒప్పందంపై పేట్రేగిన ట్రంప్‌

13 Nov, 2019 16:25 IST|Sakshi

న్యూయార్క్‌ : పారిశ్రామిక వ్యర్ధాలను ప్రక్షాళన చేసేందుకు భారత్‌, చైనా, రష్యా వంటి దేశాలు చేస్తున్నదేమీ లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అన్నారు. ఆ దేశాలు వారి వ్యర్ధాలను సముద్రంలోకి విడిచిపెడుతుండటంతో అవి లాస్‌ఏంజెల్స్‌లో తేలుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పు అనేది సంక్లిష్ట అంశమని ట్రంప్‌ చెబుతూ ఎవరు నమ్మినా నమ్మకపోయినా తను పలు విధాలుగా పర్యావరణ వేత్తనని చెప్పుకున్నారు. ఎకనమిక్‌ క్లబ్‌ ఆఫ్‌ న్యూయార్క్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ట్రంప్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

ప్యారిస్‌ వాతావరణ ఒప్పందం అమెరికాకు విధ్వంసకరమైనదని ఈ ఏకపక్ష ఒప్పందం నుంచి అమెరికా వైదొలగిందని స్పష్టం చేశారు. ఈ ఒప్పందం అమెరికన్ల ఉద్యోగాలను కొల్లగొట్టడంతో పాటు విదేశీ కాలుష్య కారకులను కాపాడుతుందని దుయ్యబట్టారు. ఈ ఒప్పందంతో అమెరికాకు లక్షల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతుందని చెప్పుకొచ్చారు. చారిత్రక ఒప్పందంగా పేరొందిన పారిస్‌ ఒప్పందం కార్యరూపం దాల్చడంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్‌ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారు. గ్రీన్‌హౌస్‌ గ్యాస్‌ విపరిణామాలను నిరోధించే క్రమంలో 2015లో 188 దేశాలు భాగస్వాములుగా ప్యారిస్‌లో అంతర్జాతీయ ఒప్పందం ముందుకువచ్చింది.

మరిన్ని వార్తలు