గ్రీన్‌కార్డుల్లో జాప్యానికి ముగింపు!

10 Feb, 2018 01:24 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదిస్తోన్న వలస విధానం అమల్లోకి వస్తే.. నిపుణులైన ఉద్యోగులకు గ్రీన్‌కార్డుల జారీలో జాప్యానికి తెరపడనుందని వైట్‌హౌస్‌ పేర్కొంది. ఒక్కో దేశానికి కోటా ప్రకారం గ్రీన్‌కార్డుల కేటాయింపుల్ని రద్దు చేయాలని భారతీయ హెచ్‌–1బీ వీసాదారులు డిమాండ్‌ చేస్తోన్న నేపథ్యంలో ఈ ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది. గత వారం రోజులుగా భారత్‌కు చెందిన నిపుణులైన ఉద్యోగులు అమెరికాలోని పలు ప్రాంతాల నుంచి వాషింగ్టన్‌ చేరుకుని.. ప్రస్తుత వలస విధానంలో మార్పు తీసుకురావాలని కోరుతూ ట్రంప్‌ యంత్రాంగం, అమెరికన్‌ కాంగ్రెస్‌ సభ్యులపై ఒత్తిడి కొనసాగిస్తున్నారు.

ప్రస్తుతం అమెరికా అనుసరిస్తోన్న వలస విధానం వల్ల హెచ్‌–1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న భారతీయ– అమెరికన్లు ఎక్కువగా నష్టపోతున్నారు. గ్రీన్‌కార్డు కోసం వారు గరిష్టంగా 70 ఏళ్లు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ‘ప్రతిభ ఆధారిత వలస విధానానికే ట్రంప్‌ మొగ్గు చూపుతున్నారు. దీంతో అత్యుత్తమ నిపుణులైన ఉద్యోగుల్ని ఆకర్షించవచ్చు. అందుకనుగుణంగా వీసా లాటరీ విధానానికి స్వస్తి చెప్పేలా ట్రంప్‌ ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది’ అని వైట్‌హౌస్‌ డిప్యూటీ మీడియా కార్యదర్శి రాజ్‌ షా చెప్పారు. ‘వీసా లాటరీ విధానానికి ముగింపు పలికే సమయం దగ్గరపడింది. మెరుగైన వలస విధానాన్ని రూపొందించడంతో పాటు అమెరికన్ల భద్రతకు కాంగ్రెస్‌ కృషిచేయాల్సిన అవసరముంది’ అని ట్వీటర్‌లో ట్రంప్‌ అన్నారు. 

మరిన్ని వార్తలు