డ్రోన్లే కదా అని తీసిపారేస్తే.. క్షిపణులను తెగ్గోస్తాయి!

16 Feb, 2018 03:41 IST|Sakshi

యుద్ధం మొదలైంది..  
శత్రు సేనలు క్షిపణులు ఎక్కుపెడుతున్నాయి.. 
ఇటువైపు పక్షం మాత్రం నింపాదిగా ఉంది.. 
క్షిపణులు ఎక్కుపెట్టలేదు.. 
జస్ట్‌.. డ్రోన్లు ఎక్కుపెట్టింది..  
వీడియో షూట్‌ కోసం కాదు.. 
శత్రు క్షిపణులను షూట్‌ చేయడానికి..!! 

ప్రస్తుతం పెళ్లిళ్లు.. మ్యాచుల్లో వీడియో షూటింగ్‌ కోసం.. పిజ్జాలను డెలివరీ చేయడం కోసం ఉపయోగిస్తున్న డ్రోన్లు.. భవిష్యత్తులో దేశం తరఫున యుద్ధం చేయనున్నాయి! ఇందుకోసం అమెరికా క్షిపణి రక్షణ సంస్థ(ఎండీఏ) లో–పవర్‌ లేజర్‌ డెమాన్‌స్ట్రేటర్‌(ఎల్‌పీఎల్‌డీ) ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగా ప్రత్యేకమైన లేజర్‌ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది. ఈ లేజర్‌ వ్యవస్థతో కూడిన డ్రోన్లు.. లాంచింగ్‌ పాడ్‌ నుంచి క్షిపణులను ప్రయోగించకముందే వాటిపై లేజర్‌ కిరణాలను ప్రయోగించి.. నాశనం చేస్తాయట. 2019 కోసం తమకు రూ.63 వేల కోట్ల బడ్జెట్‌ కావాలంటూ అమెరికా ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించిన ఎండీఏ.. అందులో భాగంగా ఎల్‌పీఎల్‌డీ ప్రాజెక్టు గురించి వివరించింది.

లేజర్‌ టెక్నాలజీ కోసం రూ.420 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కొరియా నుంచి ప్రమాదం పెరుగుతున్న నేపథ్యంలో వీటి ఆవశ్యకతను తెలియజెప్పింది. ఒకవేళ క్షిపణిని ప్రయోగించినా.. దానిని దారిలోనే అడ్డుకుని.. నిర్వీర్యం చేసే శక్తిసామర్థ్యాలు దీని సొంతమట. 2020లో ఎల్‌పీఎల్‌డీని పరీక్షించనున్నారు. వివిధ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల రక్షణకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్న నిపుణులు.. ఎల్‌పీఎల్‌డీని ఒక విప్లవాత్మకమైన టెక్నాలజీగా పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు