ఆరో మహా వినాశనం తప్పదా!

22 Sep, 2017 11:00 IST|Sakshi

ఇంకో 83 ఏళ్లలో అంటే.. 2100 సంవత్సరానికల్లా భూమ్మీద బతకడం చాలా కష్టమన్న వార్తలు మనం వినే ఉంటాం.. తాజాగా అమెరికాలోని మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ)కి చెందిన లారెన్జ్‌ సెంటర్‌ కూడా ఈ విషయాన్ని రూఢీ చేసింది. ఈ శతాబ్దం చివరికల్లా సముద్రాల్లో బోలెడంత కార్బన్‌ డయాక్సైడ్‌ వాయువు చేరిపోయి భూమి చరిత్రలో ఆరో మహా వినాశనం మొదలవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. గడిచిన 54 కోట్ల ఏళ్లలో భూమ్మీద ఐదు మహా వినాశనాలు చోటు చేసుకున్నాయిని.. వీటిల్లో ఒకదాంట్లో రాకాసి బల్లులు నాశనమై పోయాయని తెలిసిన విషయమే.

ఎంఐటీ శాస్త్రవేత్తలు భూ వాతావరణంలోని కార్బన్‌డయాక్సైడ్‌ మోతాదులో గతంలో వచ్చిన మార్పులను విశ్లేషించడం ద్వారా మహా వినాశనానికి అవకాశాలను గుర్తించారు. వాతావరణంలో కార్బన్‌డయాక్సైడ్‌ మోతాదుల్లో మార్పులు ఎక్కువ కాలం పాటు ఉంటే, అది కాస్తా జీవజాతులు అంతరించిపో యేందుకు దారితీస్తుందని.. ప్రస్తుతం అతితక్కువ సమయంలోనే ఈ వాయువు వాతావరణంలో, సముద్రాల్లోకి చేరిపోతున్నందున 2100 నాటికల్లా మహా వినాశనానికి బీజం పడేందుకు అవకాశాలు ఎక్కువని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త డేనియల్‌ రోథ్‌మన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు