రూ.375 కోట్లతో పోలీస్‌ ఆఫీసులు

22 Sep, 2017 01:39 IST|Sakshi
రూ.375 కోట్లతో పోలీస్‌ ఆఫీసులు

9 జిల్లాల్లో టెండర్లు పూర్తి
ఏడాదిన్నరలో నిర్మాణాలు పూర్తి: హౌజింగ్‌ ఎండీ మల్లారెడ్డి


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటైన జిల్లాలకు పోలీస్‌ హెడ్‌క్వార్టర్ల నిర్మాణంపై పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ కార్యాచరణ వేగవంతం చేసింది. కొత్తగా 13 జిల్లాల్లో హెడ్‌క్వార్టర్లు, 2 కమిషనరేట్ల నిర్మాణంపై టెండర్ల ప్రక్రియను తుదిదశకు చేర్చింది. 9 జిల్లాల పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌ (డీపీఓ) నిర్మాణానికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తిచేశారు.  2 కమిషనరేట్లతోపాటు మరో 4 హెడ్‌క్వార్టర్ల నిర్మాణానికి సంబంధించి త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తికానుంది. ఒక్కో పోలీస్‌ హెడ్‌క్వార్టర్ల నిర్మాణానికి మొత్తం రూ.25 కోట్లు ప్రభుత్వం కేటాయించగా, ఇందులో అడ్మినిస్ట్రేటివ్‌ భవనానికి రూ.12 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు.

పరేడ్‌ గ్రౌండ్, ఎస్పీ కార్యాలయం, నివాస భవనం, అదనపు ఎస్పీ కార్యాలయం, నివాస భవనం, ఏఆర్‌ హెడ్‌క్వార్టర్, బెల్‌ ఆఫ్‌ ఆర్మ్స్‌ తదితర నిర్మాణాలకు మిగతా నిధులను వినియోగించనున్నారు. అలాగే నూతనంగా ఏర్పడ్డ రామగుండం, సిద్దిపేటలో కమిషనరేట్లను నిర్మించనున్నారు. ఈ రెండింటికి కూడా రూ.25కోట్లతో భవన నిర్మాణ కార్యక్రమాలు చేపట్టనున్నారు. మొత్తం రూ.375 కోట్లతో పోలీస్‌ నూతన కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి. కాగా, వీటి నిర్మాణం మొత్తం పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షణలోనే జరుగుతోందని హౌజింగ్‌ ఎండీ మల్లారెడ్డి తెలిపారు. టెండర్లు పూర్తయిన వాటికి దసరా తర్వాత భూమిపూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.  ఈ మొత్తం నిర్మాణాలను పనులు ప్రారంభించిన ఏడాదిన్నరలో పూర్తిచేస్తామని ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు