కరోనా అలర్ట్‌ : మాస్క్‌లు, గ్లోవ్స్‌ కంటే ఇదే ముఖ్యం

19 Mar, 2020 09:25 IST|Sakshi

న్యూయార్క్‌ : మహమ్మారి కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు ధరించే మాస్క్‌లు, గ్లోవ్స్‌ను సరైన పద్ధతిలో వాడకుంటే అది వైరస్‌ వ్యాప్తిని పెంచే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముందుజాగ్రత్త చర్యగా అవసరం లేకుండానే పెద్దసంఖ్యలో ప్రజలు వీటిని వాడుతున్నారని..మాస్క్‌లు, గ్లోవ్స్‌లను సవ్యంగా వాడకపోతే ఇన్‌ఫెక్షన్‌లు మరింత వేగంగా విస్తరిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూరప్‌ సహా ప్రపంచాన్ని కరోనా వైరస్‌ వణికిస్తున్న క్రమంలో డబ్ల్యూహెచ్‌ఓ మహమ్మారిని కట్టడి చేసేందుకు పెద్ద ఎత్తున ప్రచారం ముమ్మరం చేసింది.

తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలని, ముఖాన్ని తాకరాదని, సామాజిక దూరం పాటించాలని సూచిస్తోంది. ఇక వైరస్‌ సోకిందని భావిస్తే మాస్క్‌ ధరించాలని, తమ కుటుంబ సభ్యులు, సన్నిహితులకు వైరస్‌ సోకకుండా ఒంటరిగా ఉండాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచిస్తోంది. అయితే ప్రతిఒక్కరూ మాస్క్‌లు, గ్లోవ్స్‌ ధరించడంతో వీటి లభ్యత తగ్గిపోయే పరిస్ధితి నెలకొంది.

వైరస్‌ సోకకుండా మిమ్నల్ని మాస్క్‌లు కాపాడేందుకు పరిమితులున్నాయని, ప్రతి ఒక్కరూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, పరిశుభ్రతను పాటించడంతో పాటు చేతులతో ముఖాన్ని తాకరాదని డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సీస్‌ డైరెక్టర్‌ మైక్‌ ర్యాన్‌ ప్రజలకు సూచించారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ 19 కేసులను పరిశీలించే వైద్య సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు నెలకు 8.9 కోట్ల మాస్క్‌లు అవసరమని అంచనా వేస్తుండగా ఇది మరిన్ని రోజులు కొనసాగితే వైద్య సిబ్బందికే మాస్క్‌లు సరిపోని పరిస్ధితి. మాస్క్‌లపై డబ్ల్యూహెచ్‌ఓ సందేశం సరిగ్గా చేరడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

చదవం‍డి : కరోనా బ్రాండ్‌ అంబాసిడర్‌ ఊబర్‌ ఆటో డ్రైవర్

ఇక మాస్క్‌లు ధరించే ముందు తమ చేతులను శుభ్రంగా కడుక్కోవాలనే సూచనను ఎవరూ పట్టించుకోవడం లేదని, మాస్క్‌ను ప్రతిసారి చేతితో తడుముతూ వాటిని సరిచేసుకుంటున్నారని ఫ్రాన్స్‌ హెల్త్‌ చీఫ్‌ జిరోమ్‌ సాల్మన్‌ చెప్పుకొచ్చారు. గ్లోవ్స్‌ను కూడా ఇదే తరహాలో వాడుతుండటంతో వీటి ద్వారా రోగాలు వ్యాపించే ప్రమాదం ముంచుకొస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్లోవ్స్‌ ధరించిన వారు చేతులను శుభ్రంగా కడుక్కోవడాన్ని విస్మరిస్తుండటంతో అవి అపరిశుభ్రంగా మారుతున్నాయని అన్నారు. ప్రజలు తమ ముఖాన్ని తరచూ తాకడం మానుకోకపోతే వైరస్‌ నుంచి గ్లోవ్స్‌ రక్షించలేవని సాల్మన్‌ అన్నారు. ప్రజలు గంటకు సగటున 20 సార్లు తమ ముఖాన్ని తాకుతుంటారని అమెరికన్‌ జర్నల్‌ ఆఫ్‌ ఇన్ఫెక్షన్‌లో ప్రచురితమైన ఓ అథ్యయనం పేర్కొంది. చర్మాన్ని తాకడం, చెవులు, కళ్లు, ముక్కు ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని, చేతులు శుభ్రం చేసుకోవడానికి గ్లోవ్స్‌ ధరించడం ప్రత్యామ్నాయం కాదని జాన్స్‌ హాప్కిన్స్‌ సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ కార్యదర్శి అమేజ్‌ అదల్జ పేర్కొన్నారు.

చదవండి : కరోనా వ్యాప్తి: ఏంజిలా మెర్కెల్ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు