తప్పు చేశానేమో.. షమీమా సంచలన వ్యాఖ్యలు..

26 Feb, 2019 09:55 IST|Sakshi

ఢాకా : ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌)లో చేరినందుకు పశ్చాత్తాప పడుతున్న తన కూతురిని వెంటనే స్వదేశానికి తీసుకురావాలంటూ అహ్మద్‌ అలీ అనే వ్యక్తి బ్రిటన్‌ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. బంగ్లాదేశీ- బ్రిటీష్‌ టీనేజర్‌ షమీమా బేగం(19).. 2015లో సిరియాకు పారిపోయి ఐఎస్‌లో చేరింది. అనంతరం అక్కడే తన సహచరుడిని పెళ్లి చేసుకుంది. గత కొంతకాలంగా సిరియన్‌ డెమొక్రటిక్‌ ఫోర్సెస్‌(ఎస్‌డీఎఫ్‌) బలపడటంతో.. ఐఎస్‌ ఉగ్రవాదులకు నిలువ నీడ లేకుండా పోతోంది. ఈ క్రమంలో షమీమా భర్తను ఎస్‌డీఎఫ్‌ దళాలు అదుపులోకి తీసుకున్నాయి.

ప్రస్తుతం ఎస్‌డీఎఫ్‌ దళాల రెఫ్యూజీ క్యాంపులో ఆశ్రయం పొందుతున్న షమీమా ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం సిరియాలో పరిస్థితులు బాగాలేని కారణంగా బిడ్డతో సహా, తనను బ్రిటన్‌కు తీసుకువెళ్లాలని మీడియా ముఖంగా ప్రభుత్వాన్ని కోరింది. ఈ క్రమంలో ఆమె వల్ల పౌరుల భద్రతకు ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉన్నందున షమీమా పౌరసత్వాన్ని రద్దు చేయాలని బ్రిటన్‌ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో తాను మీడియా ముందుకు వచ్చి తప్పు చేశానేమో అంటూ షమీమా సంచలన వ్యాఖ్యలు చేసింది.(పిక్‌నిక్‌కు వెళ్తున్నామని చెప్పి.. ప్రస్తుతం గర్భిణిగా!)

కావాలంటే అక్కడే శిక్షించండి..
ఈ నేపథ్యంలో తన కూతురి భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేసిన షమీమా తండ్రి అహ్మద్‌ అలీ... ‘ షమీమా ప్రస్తుతం బంగ్లాదేశ్‌కు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే తను బ్రిటీష్‌ పౌరురాలు. కాబట్టి ఆమెను స్వదేశానికి తీసుకురావాల్సిన బాధ్యత బ్రిటన్‌ ప్రభుత్వానికి ఉంది. ఒకవేళ షమీమా తప్పు చేసి ఉంటే.. ఆమెని లండన్‌కు తీసుకువచ్చి అక్కడే శిక్షించండి. కానీ తన పౌరసత్వాన్ని రద్దు చేయడం సరైంది కాదు. తప్పు చేయని వారు ఈ ప్రపంచంలో ఒక్కరు కూడా ఉండరు. సిరియా వెళ్లినపుడు తన వయస్సు 15 ఏళ్లు. తప్పుడు వ్యక్తుల ప్రభావంతో తను అలా చేసింది. చిన్న పిల్లలు తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత మనదే. అందుకే తనను బ్రిటన్‌కు తీసుకురావాల్సిందే అని డిమాండ్‌ చేశారు. కాగా బ్రిటన్‌ నుంచి తిరిగివచ్చిన అహ్మద్‌ అలీ ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో నివసిస్తున్నారు.

ఇక తమదేశంలో ఉన్న విదేశీ జీహాదీలను క్యాంపుల నుంచి తిరిగి తమ తమ దేశాలకు తీసుకువెళ్లాలంటూ ఎస్‌డీఎఫ్‌ పశ్చిమ దేశాలకు విజ్ఞప్తి చేస్తోన్నసంగతి తెలిసిందే. అయితే ఐసిస్‌ సానుభూతి పరులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం నిరాకరిస్తోంది. ఎస్‌డీఎఫ్‌ విఙ్ఞప్తిని మన్నించలేమని, గుర్తింపు పొందిన ఏదైనా ప్రభుత్వంలో ఈ విదేశీ జీహాదీలు భాగమైనపుడు మాత్రమే సహాయం చేసే అవకాశం ఉంటుందని పేర్కొంది. అదే విధంగా అమెరికా కూడా విదేశీ జీహాదీలను స్వదేశానికి తీసుకువచ్చినా సరే.. వారికి సరైన శిక్ష విధించాలనే దృఢచిత్తంతో ఉంది. అందుకే వివిధ దేశాలను ఇందుకు సంబంధించిన చట్టపరమైన అంశాలను సమీక్షించాల్సిందిగా ఒత్తిడి చేస్తోంది. ఈ క్రమంలో షమీమా వంటి సిరియా రెఫ్యూజీల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది.(చదవండి : ఇంటికి వెళ్లాలని ఉంది)

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా