ఆ భయమే ఆయనకు కలిసివస్తోంది!

11 Dec, 2015 11:08 IST|Sakshi
ఆ భయమే ఆయనకు కలిసివస్తోంది!

వాషింగ్టన్: అమెరికన్లు మరీ భయపడిపోతున్నారు. 2001 సెప్టెంబర్ 11 దాడుల తర్వాత మళ్లీ ఇప్పుడు తమ దేశంలో ఉగ్రవాద దాడులు జరిగే అవకాశముందని బెదిరిపోతున్నారు. వారిలో రోజురోజుకు పెరిగిపోతున్న ఈ భయమే డొనాల్డ్ ట్రంప్ కు కలిసివస్తున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వాన్ని దక్కించుకోవడానికి పోటీపడుతున్న  ట్రంప్‌ ప్రైమరీ ఎన్నికల్లో అత్యధిక ఓట్లు తెచ్చుకోవడానికి అమెరికన్లలో నెలకొన్న 'ఉగ్ర'భయమే కారణమని న్యూయార్క్ టైమ్స్-సీబీఎస్ న్యూస్ సర్వేలో తేలింది.  

పారిస్‌, కాలిఫోర్నియాలో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడుల అనంతరం ఉగ్రవాదం విషయంలో అమెరికన్ల అభిప్రాయంలో మార్పు వచ్చింది. వారు ఇప్పుడు దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఉగ్రవాద ముప్పేనని అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనలకు ముందు ఉగ్రవాదం ప్రధాన సమస్య అని 4శాతం మంది అభిప్రాయపడగా.. ఇప్పుడు 19శాతం మంది అదే అత్యంత తీవ్ర సమస్య అని చెప్తున్నారు. ప్రజల్లో నెలకొన్న అనిశ్చితి, ఆందోళనకర వాతావరణం నుంచి సహజంగానే డొనాల్డ్ ట్రంప్ లబ్ధి పొందుతున్నారు. మసీదులపై పర్యవేక్షణ ఉంచాలని,  ముస్లింలు అమెరికాకు రాకుండా నిషేధం విధించాలని ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

నిజాయితీ, సహానుభూతి, అనుభవం ఉన్న బలమైన నాయకత్వం ఉండాలని రిపబ్లికన్ ప్రైమరీ ఓటర్లలో ప్రతి 10మందిలో నలుగురు భావిస్తున్నారు. ఈ అభిప్రాయమున్న ఓటర్లు డొనాల్డ్ ట్రంప్ కు బలంగా మద్దతు పలుకుతున్నారు. ముస్లింలు అమెరికా రాకుండా తాత్కాలిక నిషేధం విధించాలంటూ ట్రంప్ వ్యాఖ్యలు చేయడం కన్నా ముందే ఈ సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ట్రంప్ దేశభక్తుడని, అమెరికాలోకి ముస్లింల వలసను ఆయన నిరోధిస్తారని పలువురు అభిప్రాయపడ్డారు. రానున్న కొన్ని నెలల్లో అమెరికాలో ఉగ్రవాద దాడి జరిగే అవకాశం అధికంగా ఉందని ఈ సర్వేలో 44శాతం అభిప్రాయపడగా.. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద గ్రూపుతో అమెరికా భద్రతకు పెను ముప్పు పొంచి ఉందని సర్వేలో పాల్గొన్న ప్రతి 10 మంది అమెరికన్లలో ఏడుగురు అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు