ఒంటరితనం.. ఓ మృత్యు కౌగిలి

25 Nov, 2015 16:41 IST|Sakshi

వాషింగ్టన్: ఒంటరితనం ఓ ఫీలింగ్ మాత్రమే కాదు.. ఇది శారీరక మార్పులకు కారణమవ్వడమే కాక.. మరణానికి దగ్గరయ్యేలా చేస్తుందట. వృద్ధుల్లో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా ఉంటుందట. అమెరికా పరిశోధకుల తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. వృద్ధుల్లో ఆరోగ్య సమస్యలు పెరగడానికి సాంఘిక  ఒంటరితనం ప్రధాన కారణమని, దీనివల్ల వృద్ధుల్లో ముందుగానే మరణం సంభవించడానికి 14 శాతం అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. ఒంటరితనానికి.. కన్సర్వుడ్ ట్రాన్స్‌క్రిప్షనల్ రెస్పాన్స్ టు ఎడ్వర్సిటీ(సీటీఆర్ఏ)కి సంబంధం ఉందని గత పరిశోధనల ఆధారంగా ఈ బృందం గుర్తించింది.

అయితే ఒంటరితనం ప్రతికూల ఆరోగ్య ఫలితాలకు కారణమవుతుందనే అంశంపై మాత్రం ఎవరికీ అవగాహన పెద్దగా లేదు. ఇదే అంశంపై యూనివర్సిటీ ఆఫ్ షికాగో సైకాలజిస్ట్ జాన్ కాకివొప్పొ నేతృత్వంలోని బృందం పరిశోధనలు జరిపింది. ఒంటరితనం వల్ల కలిగే శారీరక మార్పులు వాటి కారణంగా ఎదురయ్యే దుష్పరిణామాలపై వీరు ప్రధానంగా దృష్టి సారించారు. ఒంటరితనానికి సంబంధించి మనుషులతో పాటు రీసస్ మకాక్స్ అనే జాతి కోతులపైనా అధ్యయనం చేశారు. 2002లో 50 నుంచి 68 ఏళ్ల వ్యక్తులపై ఈ అధ్యయనాన్ని ప్రారంభించారు. ఈ పరిశోధనల్లో ఒంటరితనం అనుభవించే వారిలో రోగ నిరోధక ప్రతిస్పందనలు తక్కువగా ఉంటాయని, అదే సమయంలో వారిలో ఒంటరితనం అనుభవించని వారికంటే నొప్పి ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడైంది.


 ఈ నేపథ్యంలో కణాలలో జన్యు మార్పులు, బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి శరీరాన్ని కాపాడే రోగ నిరోధక శక్తికి సంబంధించిన సెల్స్ ఏవిధంగా పనిచేస్తున్నాయనే దానిపై అధ్యయనం జరిపారు. ఈ పరిశోధనలో ఒంటరితనం కారణంగా శరీరంపై పడే పలు దుష్పరిణామాలు వెలుగుచూశాయి. ఒంటరితనం వల్ల శరీరంలో తెల్లరక్త కణాల ఉత్పత్తి తగ్గిపోయి రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుందని వెల్లడైంది. ఒక ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత ఒంటరితనం.. భవిష్యత్లో సీటీఆర్ఏ జన్యు ప్రక్రియను అంచనా వేస్తుందని, అలాగే ఒక ఏడాది లేదా అంతకంటే ఎక్కువ కాలం తర్వాత సీటీఆర్ఏ జన్యు ప్రక్రియ ఒంటరితనం పరిణామాలను అంచనా వేస్తుందని గుర్తించారు. కణాల జన్యు పరిణామాలు, ఒంటరితనం ఒకదానికొకటి పరస్పర సంబంధం కలిగి ఉంటాయని, కాలక్రమంలో ఇవి ఒకదానికొకటి సహాయం చేసుకుంటాయని కూడా గుర్తించారు. ఈ పరిశోధన ఒంటరితనానికి మాత్రమే పరిమితమని, నిరాశ, ఒత్తిడి, సామాజిక మద్దతు మొదలైన అంశాలకు దీనికి సంబంధం లేదని పరిశోధకులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు