అలల్లాంటి విల్లాలు

14 Aug, 2016 16:36 IST|Sakshi
అలల్లాంటి విల్లాలు

విలాసాల అడ్డా దుబాయ్‌లో మరో అట్రాక్షన్ సిద్ధమవుతోంది. సముద్రంపై ఈతచెట్టు... ప్రపంచపటం ఆకారాల్లో దీవులు.. వాటిపై ఇళ్లు కట్టేసిన ఈ ఎడారి దేశంలో తాజాగా సముద్రం నీటిపై తేలియాడే విల్లాలు పుట్టుకొస్తున్నాయి. డచ్ ఆర్కిటెక్చర్ సంస్థ ‘న్యూ లివింగ్ ఆన్ వాటర్’ పేరుతో ఫొటోలో కనిపిస్తున్న విలాసవంతమైన ఫ్లోటింగ్ విల్లాల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కోడిగుడ్డు ఆకారంలో 164 అడుగుల పొడవు, 98 అడుగుల వెడల్పు ఉండే ఒక్కో విల్లా మూడు అంతస్తులు కలిగి ఉంటుంది. బేస్‌మెంట్ మొత్తం కాంక్రీట్‌తో నిర్మిస్తారు. చిన్నచిన్న గదులతో సగభాగం నిండితే మిగిలిన సగాన్ని ఇంటిని నిలకడగా ఉంచేందుకు వాడతారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో అధునాతనమైన నాలుగు బెడ్‌రూమ్‌లు, లివింగ్‌రూమ్, కిచెన్‌లుంటాయి. ప్రతి బెడ్‌రూమ్‌కు ప్రత్యేకం గా ఔట్‌డోర్ వ్యూ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు.

ఫస్ట్‌ఫ్లోర్‌లో బాల్కనీ, డైనింగ్ రూమ్‌లతోపాటు చిన్నసైజు స్విమ్మింగ్ పూల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. సముద్రపు నీటితోనే గదులను చల్లబరిచేందుకు లేదా వెచ్చగా ఉంచేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. వినియోగదారులు కోరితే వీటికి సోలార్ ప్యానెల్స్ బిగించుకోవచ్చునని, అలాగే ఎక్కడికక్కడ నీటిని శుద్ధి చేసే యంత్రాలూ ఏర్పాటు చేస్తామని అంటోంది న్యూ లివింగ్ ఆన్ వాటర్ సంస్థ. వచ్చేనెల ఆరవ తేదీన దుబాయ్‌లో మొదలుకానున్న సిటీస్కేప్ గ్లోబల్ ప్రదర్శనలో నమూనా ఇంటిని ప్రదర్శిస్తామని కంపెనీ తెలిపింది. దాదాపు 16 వేల చదరపు అడుగుల వైశాల్యం ఉండే ఒక్కో ఇంటి ఖరీదు సుమారు రూ.70 కోట్లు!

మరిన్ని వార్తలు