‘నల్లధనం’పై భారత్‌కు మద్దతు

17 Nov, 2014 02:20 IST|Sakshi
‘నల్లధనం’పై భారత్‌కు మద్దతు

పన్ను నిబంధనల్లో పారదర్శకత తెస్తామన్న జీ20 సదస్సు
పన్ను సమాచారంలో ‘పారదర్శకత’ కోసం ప్రధాని పట్టు
జీ20 శిఖరాగ్ర సదస్సు ప్లీనరీ సమావేశంలో మోదీ ప్రసంగం
 
 బ్రిస్బేన్: నల్లధనం విషయంలో జీ20 శిఖరాగ్ర సమావేశంలో భారత్‌కు భారీ మద్దతు లభించింది. ప్రపంచానికి సవాలుగా నిలిచిన నల్లధనాన్ని అరికట్టేందుకు పన్నుల విషయంలో ప్రపంచ దేశాల మధ్య సంబంధిత సమాచారంపై పారదర్శకత ఉండాలని, ఆ సమాచారాన్ని బహిర్గత పరచాల్సిన అవసరముందని భారత ప్రభుత్వ వైఖరికి జీ20 మద్దతు పలికింది. ఈ విషయంలో దేశాల మధ్య ఎప్పటికప్పుడు సమాచార మార్పిడి జరిగేలా సరికొత్త అంతర్జాతీయ ప్రమాణాన్ని నెలకొల్పాలన్న భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ వాదనతో ఏకీభావం వ్యక్తంచేసింది. అంతర్జాతీయ పన్ను నిబంధనలను ఆధునీకరించేందుకు జీ20 చేపట్టిన కార్యాచరణ ప్రణాళికపై గణనీయమైన పురోగతి సాధించామని పేర్కొంది. హానిపూరిత పన్ను అలవాట్లకు కారణమైన పన్నుదారుకు సంబంధించిన నిబంధనల్లో పారదర్శకతతో సహా ఈ ప్రణాళికను 2015 కల్లా అమలుచేస్తామని ప్రకటనలో పేర్కొంది. అభివృద్ధి చెందిన, చెందుతున్న 20 ప్రధాన దేశాల బృందం జీ20 రెండు రోజుల శిఖరాగ్ర సదస్సు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఆదివారం ముగిసింది.
 
 శనివారం నాడు మొదలైన సదస్సులో ప్రసంగించిన భారత ప్రధాని మోదీ.. నల్లధనం వెలికితీతపై ప్రపంచ దేశాల సహకారం కోరిన విషయం తెలిసిందే. ఆదివారం ప్లీనరీ సదస్సులో.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఒత్తిడిలను ఎదుర్కొని నిలిచేలా మలచే అంశంపై మోదీ ప్రసంగించారు. పెట్టుబడుల చలనశీలత, సాంకేతిక పరిజ్ఞానం అనేవి.. పన్నులు, లాభాల పంపిణీని ఎగవేసేందుకు కొత్త అవకాశాలను సృష్టించాయని పేర్కొన్నారు. పన్ను ఎగవేసేందుకు ప్రభుత్వాలకు లెక్క చెప్పకుండా విదేశాల్లో దాచిన సొమ్ముకు సంబంధించిన సమాచారాన్ని పరస్పరం ఇచ్చిపుచ్చుకునేందుకు, తద్వారా ఆ సొమ్మును వెనక్కు రప్పించేందుకు కొత్త అంతర్జాతీయ ప్రమాణాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు. ప్రతి దేశమూ.. ప్రత్యేకించి పన్నులు లేని దేశాలు కూడా ఒప్పందంలో తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనల ప్రకారం పన్నుల విధింపు కోసం సమాచారాన్ని అందించాలని కోరారు. ఈ విషయంలో సమాచార మార్పిడికి చేపట్టే కార్యక్రమాలకు భారత్ మద్దతునిస్తుందన్నారు.
 లాభాలు ఆర్జించిన చోటే పన్నుల విధింపు...
 
 ప్రపంచం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 85 శాతం వాటా గల దేశాలతో కూడిన ఈ జీ20 బృందం సదస్సు అనంతరం మూడు పేజీల ప్రకటనను జారీ చేసింది. ‘‘అంతర్జాతీయ పన్ను వ్యవస్థ మరింత సముచితంగా ఉండేలా చేసేందుకు, ఆయా దేశాల ఆదాయ మూలాలకు భద్రత దెబ్బతినకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నాం. లాభాలను గడించే ఆర్థిక కార్యకలాపాలను ఎక్కడైతే నిర్వహిస్తున్నారో, ఎక్కడైతే విలువ సృష్టి జరిగిందో ఆ లాభాలపై అక్కడే పన్నుల విధింపు జరగాలి’’ అని పేర్కొంది.
 
 మోదీ జోక్యంతోనే ప్రకటనలో ‘పారదర్శకత’
 
  మోదీ వెంట సదస్సుకు హాజరైన భారత రైల్వేమంత్రి సురేశ్‌ప్రభు, విదేశాంగ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్‌లు జీ20 సదస్సు, ప్రకటన వివరాలను మీడియాకు తెలిపారు. వాస్తవానికి సదస్సు ప్రకటన ముసాయిదాలో ‘పారదర్శకత’ అనే ప్రస్తావన లేదని.. ఆదివారం నాటి ప్లీనరీ సమావేశంలో మోదీ నొక్కిచెప్పటంతో తుది ప్రకటనలో ఈ అంశాన్ని చేర్చారన్నారు.

మరిన్ని వార్తలు