బోరిస్‌ జాన్సన్‌ ఘన విజయం

13 Dec, 2019 11:20 IST|Sakshi
బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌

 ప్రతిపక్షానికి భారీషాక్‌,  బోరిస్‌కే పట్టం

బ్రిటన్‌ పార్లమెంటు ఎన్నికల్లో ప్రస్తుత ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ భారీ విజయాన్ని సాధించారు. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ మొత్తం 650 స్థానాల్లో 340 స్థానాల్లో విజయాన్ని చేజిక్కించుకుంది. పోల్‌ సర్వే అంచనాలను తారుమారు చేస్తూ పార్టీ ఘన విజయాన్ని దక్కించుకుంది. జాన్సన్‌, కార్బిన్‌ మధ్య హోరాహోరీ పోటీలో చివరకు బోరిస్‌ ఈ విజయాన్నందుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష లేబర్‌పార్టీ 208 స్థానాలకు పరిమితమైందని స్థానిక మీడియా రిపోర్ట్‌ చేసింది. ఇంకా పూర్తి ఫలితాలు వెల్లడి కావాల్సి వుంది.

1987లో మార్గరెట్ థాచర్ సాధించిన విజయం తరువాత ఇదే అతిపెద్ద విజయమని అక్కడి రాజకీయ పండితులు భావిస్తున్నారు. అలాగే లేబర్‌ పార్టీ చిత్తుగా ఓడిపోయింది. 1935 తరువాత అతి దారుణమైన పరాజయమన్నారు. దీంతో లేబర్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రతిపక్ష నేత జెరెమీ కార్బిన్ ప్రకటించారు. రాబోవు సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తాను నాయకత్వం వహించనని  పేర్కొన్నారు.  అలాగే లిబరల్‌ డెమొక్రాట్‌ నేత జో స్విన్‌సన్‌ ఓటమి పాలయ్యారు.

ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బ్రిటన్‌ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అభినందనలు తెలిపారు. భారీ మెజారిటీతో తిరిగి అధికారం చేపట్టనున్నందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరుదేశాల సత్సంబంధాలకోసం కలిసి పనిచేయాలని మోదీ ఆకాక్షించారు. మరోవైపు బోరిస్‌ ఘన విజయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంతోషం వ్యక్తం చేశారు. కాగా గురువారం నిర్వహించిన ఎన్నికల్లో పోలింగ్‌ శాతం భారీగా నమోదైంది.  నాలుగేళ్ల వ్యవధిలో బ్రిటన్‌ పార్లమెంటుకు ఎన్నికలు జరగడం ఇది మూడవసారి.


 ప్రతిపక్ష లేబర్‌ పార్టీ అభ్యర్థి జెరిమి కార్బిన్‌

మరిన్ని వార్తలు