ఇదేమి! పాపపై పక్షి దాడి

4 May, 2016 21:08 IST|Sakshi
ఇదేమి! పాపపై పక్షి దాడి

హూస్టన్‌: అమెరికాలోని హూస్టన్‌లో ఆదివారం నాడు ఓ ఐదేళ్ల బాలికపై గూస్‌ (బాతులాంటి ఈజిప్షిన్‌ నీటి పక్షి) దాడి చేస్తున్న ఈ దశ్యాలు ప్రస్తుతం సోషల్‌ వెబ్‌సైట్‌ ‘ట్విట్టర్‌’లో హల్‌చల్‌ చేస్తున్నాయి. దాడికి గురైన ఐదేళ్ల బాలిక సమ్మర్‌ గిడెన్‌పై నీటి పక్షి దాడి చేస్తున్న ఈ దశ్యాలను ఆమె 17 ఏళ్ల సోదరి స్టెవీ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేయగా, 40 వేలకుపైగా రిట్వీట్స్, 54 వేల లైక్స్‌ వచ్చాయి.

సమ్మర్, స్టెవీలతోపాటు పొరుగున నివసిస్తున్న మరో ఇద్దరు పిల్లలు కొన్ని రోజుల క్రితమే ప్రసవించిన నీటి పక్షి పిల్లలను చూడడం కోసం వాటి వద్దకు వెళ్లారు. తన పిల్లలకు హాని తలపెడతారనుకున్నదేమో మరి, ఆ పక్షి అక్కడి నుంచి వారిని రోడ్డు మీదకు తరిమి కొట్టింది. అందరిలోకి చిన్నదైన సమ్మర్‌ జుట్టును పీకి గోల చేసింది. ఆ దాడికి కిందపడి పోయిన సమ్మర్‌ గొల్లుమని ఏడ్చేసింది. దూరంగా ఉండి ఈ దాడి సన్నివేశాన్ని చూస్తున్న ఓ పొరుగింటి యువకుడు సెల్‌ఫోన్‌లో దీన్ని బంధించగా సమ్మర్‌ సోదరి స్టెవీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.


అరే! భలే సరదాగా ఉన్నాయే ఈ దశ్యాలు అనుకున్న వారే ఎక్కువ సోషల్‌ మీడియాలో. పాపం పాప మీద పక్షి దాడిచేస్తే ఆ సన్నివేశాన్ని చూసి నవ్వుకోవడం ఏమిటీ? తీరిగ్గా ఫొటోలు తీసిన పొరుగింటాయని ఆ పాపను ఎందుకు రక్షించడానికి ప్రయత్నించలేదు? అని ప్రశ్నించిన వారు కూడా లేకపోలేదు. పొరుగింటాయని ఒకరు ఫొటోలు తీస్తుండగా, మరో పొరుగింటాయన పాపను రక్షించేందకు వెళ్లారని, ఈ దాడిలో తన చెల్లెలు కూడా ఏమీ గాయపడలేదని, అందుకే తాను సరదాగా ఈ ఫొటోలను పోస్ట్‌ చేశానని స్టెవీ ఆనక వివరణ ఇచ్చింది.

మరిన్ని వార్తలు