ఇది మూడో ప్రపంచ యుద్ధం కాదా?

25 Nov, 2015 13:51 IST|Sakshi



అస్పష్టత. నూటికి నూరింతలు అస్పష్టత ఉంటే తప్ప యుద్ధాలు జరగవు. ఇంతకీ ఎవరికి అస్పష్టత? శ్రమ, పరిశ్రమలతో ఆయా దేశాలకు కేవలం ఆదాయ వనరుగా ఉన్న సామాన్యులకు.. సాధారణ ప్రజలకు! మన స్పష్టత కోసం సిరియా సంక్షోభాన్ని పరిశీలిద్దాం..

ప్రస్తుతం ఇరాక్, సిరియాల్లో అరడజనుకు పైగా దేశాల సైన్యాలు, రెండు డజన్ల దేశాలకు చెందిన జిహాదీలతో తలపడుతున్నారు. అక్కడి పేలుళ్ల కర్మ, క్రియల్లో భారతీయులు, పాకిస్థానీలు, అరబ్బులు, అమెరికన్లు, కుర్దులు,తుర్కులు, యూరోపియన్లు, తాలిబన్లు,  తాజాగా రష్యన్లు కీలకంగా వ్యవహరిస్తున్నారు. స్థలాభావం వల్ల ఈ జాబితా కుదించినప్పటికీ పోరాటంలోకి దిగుతున్న జాతులు లేదా దేశాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ సందర్భంలోనే ఎవరెవరు ఏం చేస్తున్నారో చూద్దాం..

రష్యా.. సిరియాలో గగనతలం నుంచి దాడులు చేస్తున్నది. వాళ్ల టార్గెట్ ఐఎస్ఐఎస్ కాదు. అసద్ వ్యతిరేకులు. అక్కడున్న స్థావరాల్లో ఏది ఐఎస్ దో, ఏది తిరుగుబాటు దళాలవో నిర్ధారించుకుని మరీ మిగ్ విమానాలు బాంబులు కురిపిస్తున్నాయి. అలాగని రష్యాకు ఐఎస్ తో దోస్తీ ఉందనీ చెప్పలేం. నిన్న (మంగళవారం) రష్యా యుద్ధ విమానాన్ని కూల్చేసిన టర్కీకి రెండు లక్ష్యాలున్నాయి. ఒకటి కుర్దుల అణిచివేత. రెండు అసద్ కూల్చివేత. అయితే మొదటి లక్ష్యం కోసం గట్టిగా ప్రయత్నించే టర్కీ.. రెండో లక్ష్యసాధనకు కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు రష్యా విమానం కూల్చివేతతో అర్థమవుతుంది. ఐఎస్ కు వ్యతిరేకంగా పోరాడే కుర్దులతో వీరిది జాతి వైరం.

ఇక అమెరికా, అసద్ వ్యతిరేక దళాలకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. అదే సమయంలో ఐఎస్ఐఎస్ పైనా పోరాడుతున్నట్లు ప్రకటించుకుంది. యూఎస్ తో కలిసి ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, కెనడా యుద్ధ విమానాలు సిరియా గగన తలంలో చక్కర్లు కొడుతున్నాయి. మధ్యప్రాచ్యంలో అమెరికా పెత్తనాన్ని నిరోధించేందుకు ఇరాన్ లాంటి దేశాలు రష్యాతో కలిసి పోరాటంలోకి దిగాయి. ఇరాన్ కు కుర్దులతో వైరముంది. ఐఎస్ తో దోస్తానా విషయంలో ఎక్కడా బయటపడదు ఇరాన్.

సిరియాలో అసద్ ప్రభుత్వాన్ని పడిపోనివ్వబోమంటూ ఇరాన్, రష్యాలు ప్రతినబూనిన కొద్ది గంటల్లోనే పశ్చిమ దేశాలపై ఐఎస్ఐఎస్ దాడులకు దిగింది. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఒత్తిడి ఏర్పడుతుందని, అంతర్జాతీయ సంస్థలే అసద్ ను గద్దెదింపుతాయని  ఐఎస్ విశ్వాసం. ఆశించినట్లే 'సిరియాలో శాంతి స్థాపనకు ఎన్నికల నిర్వహణ ఒక్కటే మార్గం' లాంటి ప్రకటనలు ఐక్యరాజ్యసమితి, జీ-20 సదస్సుల నుంచి వెలువడ్డాయి.

 

ఈ సంక్షోభమేకాక ప్రపంచంలోని మిగతా దేశాల్లో సరాసరి మూడు తీవ్రవాద సంస్థలు ప్రభావాన్ని చూపుతుండటం, అవన్నీ అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన(!) ఉగ్రసంస్థలతో సత్సంబంధాలూ ఏర్పర్చుకున్నాయి. అసలేమిటిదంతా? ఎవరు ఎవరి పక్షాన పోరాడుతున్నారు? ఎవరు ఎవరి కోసం తపిస్తున్నారు? అనే శేష ప్రశ్నలకు అస్పష్టత (యుద్ధం) ఒక మలుపే తప్ప అసలు సమాధానం కాదు.

ఆ సమాధానం మనకు తెలిసేనాటికి  ఈ ప్రపంచం ఇప్పుడున్నట్లుండదు. 20 వ శతాబ్ధంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు, 21 వ శతాబ్ధంలో చోటుచేసుకున్న అఫ్ఘానిస్థాన్, ఇరాక్ యుద్ధాల సందర్భంలో యుద్ధం చేయడానికి చూపిన కారణాలు, యుద్ధం తర్వాత వెల్లడైన వాస్తవాలు పరస్పరం విరుద్ధంగా ఉండటం తెలిసిందే. ఈ లెక్కన ఇప్పటికే మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమైనట్లే.

2011లో మొదలైన సిరియా సంక్షోభం మలుపులు తిరుగుతూ అనేక దేశాలను తనలోకి ఎలా లాగిందీ, ఉద్దేశపూర్వకంగానో, అనుకోకుండానో పోరులోకి ప్రవేశించి, ఆ తర్వాత విభిన్న లక్ష్యాల కోసం ఒకే ప్రాంతంలో పోరాడుతున్న తీరు గురించి ప్రముఖ కాలమిస్ట్, ప్రొఫెసర్ ఫ్రిదా ఘిటీస్ 'సీఎన్ఎన్'లో రాసిన ప్రత్యేక కథనం ఇది.

మరిన్ని వార్తలు