బంధం కోసం: 'ఐ ఫర్‌ ఐ'

5 Jul, 2017 19:24 IST|Sakshi
బంధం కోసం: 'ఐ ఫర్‌ ఐ'

జెరుసలేం/న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెటన్యాహుతో బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రపంచ శాంతి, భద్రతలకు ఇరుదేశాలు చేయాల్సిన కృషిపై చర్చించారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఇరువురు దేశాధినేతల భేటీలో ఏడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. వీటిలో వ్యవసాయం, నీటి నిర్వహణ వంటి కీలకమైన ఒప్పందాలు కూడా ఉన్నాయి.

ఇజ్రాయెల్‌లో తనకు లభించిన స్వాగతానికి ప్రధానమంత్రి మోదీ.. నెటన్యాహుకు ధన్యవాదాలు తెలియజేశారు. భారత పర్యటనకు కుటుంబ సమేతంగా విచ్చేయాలని మోదీ నెటన్యాహును ఆహ్వానించారు. దీనిపై స్పందించిన నెటన్యూహు.. మోదీ ఆఫర్‌ను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే భారత పర్యటనకు విచ్చేస్తామని వెల్లడించారు. కాగా, ఓ భారత ప్రధానమంత్రి ఇజ్రాయెల్‌ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి.

మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన - కీలకాంశాలు:
1- ఇరువురు దేశాధినేతల భేటీ అనంతరం 2008 పేలుళ్ల బాధితురాలైన ఇజ్రాయెల్‌ బాలిక మోషే హోల్ట్జ్‌బెర్గ్‌ను మోదీ కలిశారు. మోషే ప్రధానమంత్రి మోదీని తమ దేశానికి ఆహ్వానిస్తూ 'డియర్‌ మిస్టర్‌ మోదీ.. ఐ లవ్‌ యూ' అంటూ వెల్‌కమ్‌ నోట్‌ను చదివింది.
2- ఇరు దేశాలను ఉగ్రవాదం సవాలు చేస్తోందని నెటన్యాహు అన్నారు. మోషేను కలవడం ఇరు దేశాలు చెడుకు వ్యతిరేకంగా పోరాడతాయని చెప్పడానికేనని తెలిపారు.
3- వ్యవసాయం, నీరు, ఆరోగ్యం తదితర కీలకాంశాలపై చర్చించినట్లు నెటన్యాహు పేర్కొన్నారు. ఇరుదేశాల భాగస్వామ్యం మంచిని పెంచి పోషించేందుకు కృషి చేస్తుందని చెప్పారు.
4- భారత్‌, ఇజ్రాయెల్‌లు ఒకరి ఇంట్రెస్ట్‌లను మరొకరు పరస్పరం గౌరవించుకుని, సహకరించుకుంటాయని మోదీ పేర్కొన్నారు.
5- ఇరు దేశాలు పెట్టుబడులను పెంచుకుంటు పోవడం వల్ల భాగస్వామ్యం మరింత దృఢపడుతుందని మోదీ చెప్పారు. గురువారం ఇరు దేశాల ప్రధానమంత్రులు టాప్‌ కంపెనీల సీఈవోలను భేటీ అవనున్నారు.
6- మూడు రోజుల పర్యటనకు వెళ్లిన మోదీ.. తనకు లభించిన ఆహ్వానంపై ట్వీటర్‌ ద్వారా స్పందించారు. తనను ప్లీజ్‌ చేయడం కోసం అధ్యక్షుడు రివ్లిన్‌ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని చెప్పారు. ఇజ్రాయెల్‌ తనకు ఘన స్వాగతాన్ని పలికిందని తెలిపారు. నెటన్యాహు తనకు ఇచ్చిన గౌరవం భారత ప్రజలకు ఇచ్చిందని అన్నారు.
7- ఐ ఫర్‌ ఐ( ఇండియా ఫర్‌ ఇజ్రాయెల్‌, ఇజ్రాయెల్‌ ఫర్‌ ఇండియా) అని మోదీ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు రివ్లిన్‌ను కలిసిన అనంతరం మోదీ ఈ వ్యాఖ్య చేశారు.
8- ఈ రోజు కోసం తాము 70 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నట్లు ఇజ్రాయెల్‌ ప్రధానమంత్రి నెటన్యాహు అన్నారు. భారత్‌-ఇజ్రాయెల్‌ల మధ్య సంబంధం సహజమైనదని చెప్పారు.
9- ప్రధాని మోదీకి ఇస్తున్న విందుకు నెటన్యాహు హాజరయ్యారు.
10- ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి జెరుసలేంలో ప్రధాని మోదీ చేసే ప్రసంగానికి నెటన్యాహు కూడా హాజరుకానున్నారు.

మరిన్ని వార్తలు