సెనేట్‌ కొట్టేయాలి అంతే..

14 Jan, 2020 08:26 IST|Sakshi

వాషింగ్టన్‌: తనపై మోపిన అభిశంసన తీర్మానాన్ని సెనేట్‌ కొట్టేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యాఖ్యానించారు. అమెరికా చరిత్రలో అభిశంసనకు గురవుతున్న మూడో అధ్యక్షుడిగా ట్రంప్‌ రికార్డు సృష్టించగా.. త్వరలోనే దీనిపై విచారణ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. డెమోక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు వ్యతిరేకంగా విచారణ చేపట్టేలా ఉక్రెయిన్‌పై ఒత్తిడి తీసుకొచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఆ తరువాత విచారణ విషయంలో కాంగ్రెస్‌ను అడ్డుకున్నారని ట్రంప్‌పై అభియోగాలు ఉన్నాయి. అయితే అభిశంసన విచారణ సాక్షులకు తనదైన ఆలోచనలు పంచిన ట్రంప్‌ ఆదివారం మాత్రం విచారణ జరగడానికే వీల్లేదన్నారు.

టంప్‌ను కలిసిన హర్షవర్ధన్‌ ష్రింగ్లా
వాషింగ్టన్‌: అమెరికాలో భారత రాయబారి హర్షవర్థన్‌ ష్రింగ్లా (57), అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను కలిశారు.  పదవీ కాలం ముగించుకొని తిరిగి స్వదేశానికి వెళ్లనున్న భారత రాయబారిని అమెరికా అధ్యక్షుడు కలవడం ఇదే మొదటిసారి.  2019 జనవరి 9 నుంచి అమెరికాలో భారత రాయబారిగా పని చేస్తున్న ష్రింగ్లా తన పదవీకాలాన్ని ముగించుకొని భారత్‌కు తిరిగి రానున్నారు. భారత్‌లో ఈ నెల 29న విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ట్రంప్‌ను కలిసి తనకు సహకారం అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు