భారత్, ఇజ్రాయెల్ నిర్ణయం

16 Nov, 2016 02:15 IST|Sakshi
భారత్, ఇజ్రాయెల్ నిర్ణయం

న్యూఢిల్లీ: ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టం చేసేలా రక్షణ భాగస్వామ్యం, ఉగ్రవాదంపై పోరులో సహకారాన్ని పెంపొందించుకోవాలని భారత్, ఇజ్రాయెల్ నిర్ణయించాయి. ఇజ్రాయెల్ అధ్యక్షుడు రుయ్‌వెన్ రివ్లిన్ మంగళవారం ప్రధాని మోదీతో భేటీ అయి వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, నీటి వనరులు, విద్య, పరిశోధనలపై చర్చించారు. మోదీ మాట్లాడుతూ పాకిస్తాన్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డారు. ‘ఇతర వ్యవస్థీకృత నేరాలతో సంబంధాలున్న ఉగ్రవాదానికి హద్దుల్లేవు. ఇది ప్రపంచానికి పెను సవాల్ అన్న విషయాన్ని ఇరు దేశాలు గుర్తించాయి. అయితే, ఉగ్రవాదానికి మూల మై, దాన్ని విస్తరిస్తున్న దేశం భారత్‌కు పొరుగున ఉండటం విచారకరం’ అని అన్నారు.

అన్ని ఉగ్రవాద నెట్‌వర్క్‌లు, దాన్ని కాపాడే దేశాలపై అంతర్జాతీయ శక్తులు సంక్పలంతో పోరాటం చేయాలన్న విషయానికి ఇరు దేశాలు అంగీకారం తెలిపాయని మోదీ చెప్పారు. ‘ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవడంలో విఫలం కావడం, మౌనంగా ఉండటం వల్ల ఉగ్రవాదం మరింత పెరుగుతుంది. శాంతికాముక దేశాలకు ముప్పుగా ఉన్న తీవ్రవాద, ఉగ్రవాద శక్తులపై పోరాటంలో సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని నిర్ణయించాం’ అని పేర్కొన్నారు. కరువు ప్రాంతాల్లో ఇజ్రాయెల్ వినియోగిస్తున్న సూక్ష్మనీటిపారుదల పరిజ్ఞానాన్ని కొనియాడుతూ.. దీన్ని భారత్‌లో నీటి నిర్వహణ, పరిరక్షణ, శాస్త్రీయ పరిశోధన రంగాల్లో వినియోగించడంపై దృష్టి కేంద్రీకరించామన్నారు.తమ మధ్య చర్చల్లో మేకిన్ ఇండియా ప్రస్తావన వచ్చిందని, తాము ‘మేకిన్ ఇండియా’, ‘మేక్ విత్ ఇండియా’కు సిద్ధంగా ఉన్నామన్నారు.

మరిన్ని వార్తలు